రాజకీయ ఆందోళనలు వేరు.. ప్రజా ఆందోళన వేరు. రాజకీయ పార్టీలు రోడ్డెక్కి తమ కార్యకర్తలతో నిరసన వ్యక్తం చేయడం వేరు. కానీ.. ప్రజలు.. తమకు వచ్చిన కష్టంపై ఆందోళన చెందడం వేరు. రాజకీయ పార్టీలు చేసే ఆందోళతో ప్రభుత్వాలకు పెద్ద పట్టింపు ఉండదు.. విపక్షాల డ్యూటీ అవి చేస్తాయి. కానీ.. ప్రజల ఆందోళన మాత్రం.. ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ బిల్లుల విషయంలో.. ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన ఉంది. ఎవరూ బిల్లులు కట్టడం లేదు. చాలా ఎక్కువగా బిల్లులు వచ్చాయని.. తాము ఎక్కడి నుంచి తెచ్చి కడతామని మథనపడుతున్నారు. వీరి ఇబ్బందిని గుర్తించిన ప్రభుత్వం జూన్ నెలాఖరు వరకూ చెల్లించేందుకు గడువు ఇచ్చింది. కానీ ప్రజలు అంతకు మించి ఆశిస్తున్నారు.
కరోనా కారణంగా… ఉపాధి దెబ్బతినిపోయింది. రెండు నెలల నుంచి ఎవరికీ పనుల్లేవు. ఈ కారణంగా.. మూడు నెలల కరెంట్ బిల్లులు రద్దు చేయాలన్న డిమాండ్‌ను.. ప్రభుత్వం ముందు ఉంచడం ప్రారంభించారు. ప్రజల ఆందోళనను గుర్తించిన రాజకీయ పార్టీలు ఇదే అంశాన్ని ప్రముఖంగా ఎత్తుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ విపక్ష పార్టీలన్నీ విడివిడిగా అయినా సింగిల్ ఎజెండాగా కరెంట్ బిల్లుల అంశాన్ని ఎత్తుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. , సీపీఐ నేత రామకృష్ణ మూడు నెలల పాటు బిల్లులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ మండలాలు, నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టింది. బీజేపీ నిరసనలు, దీక్షలు ఎప్పుడో ప్రారంభించి .. కొనసాగిస్తోంది.
ప్రభుత్వం చార్జీలు పెంచిందో.. శ్లాబులే మార్చిందో…ప్రజలు ఎక్కువే వాడుకున్నారో కానీ..కరెంట్ బిల్లులు అందరికీ ఎప్పుడూ వచ్చేదానికి రెట్టింపు వచ్చాయి. ఈ ఆగ్రహం అందరిలోనూ కనిపిస్తోంది. కేవలం సొంత ఇళ్లు ఉన్న వారికే కాదు.. అద్దెలకు ఉన్న వారికీ ఈ భారం తప్పలేదు. అసలే..లాక్ డౌన్ కారణంగా ఆదాయం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతూంటే.. ప్రభుత్వం ఇలా కరెంట్ చార్జీలు బాదేయడంపై సామాన్యుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అందరి దగ్గర్నుంచి వ్యతిరేకత కనిపిస్తూండటంతో… అన్ని పార్టీలు.. కరెంట్ బిల్లుల తగ్గింపు కోసం పోరాటం చేయాలని నిర్ణయించాయి. నిన్నామొన్నటిదాకా చార్జీలు పెంచలేదని.. వివరణ ఇచ్చిన మంత్రులు.. ఇప్పుడు సైలెంటయ్యారు. ఏదో ఒకటి చేయకపోతే ఇబ్బందికరమని నమ్ముతున్నారు. ఏదైనా డైనమిక్‌గా నిర్ణయం తీసుకునే ముఖ్యమంత్రి… ఏ క్షణమైనా మూడు నెలల బిల్లుల్ని రద్దు చేస్తూ.. ప్రకటన చేస్తారని.. సామాన్యులు ఆశ పడుతున్నారు.