జాతీయ మీడియాలో వైసీపీకి అనుకూలంగా సర్వేలు.. రిపోర్టులు ప్రకటించే చానల్‌గా ఎన్డీటీవీకి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆ చానల్‌కు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కాంట్రాక్ట్ ఇచ్చింది. న్యూస్ చానల్‌కు కావాలంటే..యాడ్స్ ఇవ్వొచ్చు కానీ..కాంట్రాక్టులు ఎలా ఇస్తారనే డౌట్ రావొచ్చు కానీ.. ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే.. ఏదో ఓ సందు చూసుకుని ఇవ్వొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉంచాలని నిర్ణయించుకుంది. విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకమని..రాజ్యాంగ విరుద్ధమని…హైకోర్టు కూడా రూలింగ్ ఇచ్చినా వెనక్కి తగ్గడం లేదు. ఆ ఇంగ్లిష్ మీడియం కాన్సెప్ట్ లో భాగంగానే.. ఎన్డీటీవీకి ఇంటర్యూ ఇచ్చారు.
అదేమిటంటే.. ఇప్పటికిప్పుడు అర్జంట్‌గా ఇంగ్లిష్ మీడియం విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఓ సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి అనిపించింది. ప్రభుత్వానికి అలా అనిపించక ముందే.. ఎన్డీటీవీ ప్రపోజల్ పంపిందో… లేకపోతే.. అలా అనిపించిన తర్వాత పంపిందో కానీ… ఎన్డీటీవీ నుంచి వచ్చిన ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నచ్చింది. వెంటనే.. అంగీకరిస్తున్నట్లుగా.. విద్యాశాఖ జీవో జారీ చేసింది. ఇంగ్లిష్ మీడియంపై ఎన్డీటీవీ సంస్థ స్టేట్ లెవల్ సర్వే చేస్తుందని…అలాగే.. ప్రభుత్వ కార్యక్రమాలపై ఏడు షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తుందని విద్యాశాఖ తన జీవోలో పేర్కొంది.
అయితే…ఈ సర్వేకు..ఈ షార్ట్ ఫిల్మ్స్‌కు ఎంత మొత్తం చెల్లిస్తున్నారో జీవోలో లేదు. విడిగా చెల్లింపులు చేస్తారు కావొచ్చు. కొద్ది రోజుల కిందట..ఎన్డీటీవీ … లాక్‌డౌన్ అమలులో ఏపీ నెంబర్ వన్ అనే సర్వేను ప్రసారం చేసింది. గతంలో.. సాక్షి చానల్‌ను రెండేళ్ల పాటు ఎడిటోరియల్ సేవలను అందించడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి.. ఎన్డీటీవీతో ఒప్పందం చేసుకుని సేవలు పొందారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేరుగా ఎన్డీటీవీకి కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఎన్డీటీవీ యాజమాన్యానికి జగన్ కు మధ్య మంచి సౌహార్థిక సంబంధాలు ఉన్నాయన్న చర్చ ఇలాంటి ఫేవరింజం చూపించడం వల్ల వస్తోంది.