ఉద్యోగుల డిమాండ్లకు ఏపీ సర్కార్ ఓకే చెప్పింది. ఈ నెల నుంచి ఉద్యోగులందరికీ వంద శాతం జీతాలివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ట్రెజరీలకు ఆదేశాలు జారీ చేశారు. రెండు నెలలుగా..సగం..సగం జీతం మాత్రమే ఉద్యోగులకు చెల్లిస్తున్నారు. దీంతో ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి ఉంది. జీతాల బిల్లులు పెట్టే సమయం దగ్గర పడటంతో ఉద్యోగ సంఘాల నేతలు…తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఓ న్యాయశాఖ ఉద్యోగి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయనకు మొత్తం జీతం ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడమే కాదు.. హైకోర్టు పరిధిలోని ఉద్యోగుల జీతాలను కూడా… హైకోర్టుకు తెలియకుండా కట్ చేయడంపై ధర్మాసనం మండిపడింది. వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఈ నెల జీతాలు కూడా కట్ చేస్తే.. కొంతమంది కోర్టుకు వెళ్లే అవకాశం ఉండటం… మద్యం అమ్మకాలు కూడా ప్రారంభించడంతో.. ఈ నెల కూడా సగం జీతాలిస్తే.. ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. మొదటి సారి సగం జీతం ఇచ్చినప్పుడు… మిగతా సగం రెండో విడతలో చెల్లిస్తామని చెప్పింది. ఇప్పుడు రెండు నెలలు పాటు సగం సగం జీతం ఇవ్వడంతో…ఆ మొత్తం ఇవ్వాల్సి ఉంది.
రెండు నెలల పాటు తగ్గించిన మొత్తం ఎప్పడిస్తారన్నదానిపై ప్రభుత్వం ప్రకటన చేయలేదు. కానీ ఈ నెలమాత్రం పూర్తి జీతాలిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పన్నుల్లోవాటాల కింద కేంద్రం…దాదాపుగా రెండు వేల కోట్లు విడుదల చేసింది. దాంతో పాటు వివిధ పద్దుల కింద నిధులు వస్తున్నాయి. దాంతో జీతాలివ్వడానికి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.