బేసిన్లు లేవు..భేషజాలు లేవు.. అపెక్స్ కౌన్సిల్లాంటివి అవసరం లేదు.. మాకు మేమే అపెక్స్ అన్నట్లుగా నిన్నామొన్నటిదాకా ఉన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్లోనే జల వివాదాలు తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాలకు పులిస్టాప్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నాయి. ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతోందని తెలంగాణ..తెలంగాణనే ఆ పని చేస్తోందని ఏపీ… తెలుగు రాష్ట్రాల మధ్య పారే రెండు ప్రధాన నదుల బోర్డులకూ ఫిర్యాదులు వెళ్లాయి. ఏపీ ఫిర్యాదులపై తెలంగాణలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వాలని ఆయా నదీ బోర్డులు తెలంగాణ సర్కార్ ను కోరాయి.
ఏపీ నిర్మించతలపెట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణ పనులపై.. ముందుకెళ్లవద్దని ఏపీ సర్కార్ కు ఆదేశాలొచ్చాయి.ఈ వివాదాలు అంతకంతకూ పెరుగుతూండటంతో… కేంద్రం చొరవ తీసుకుంటోంది. అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలని నిర్ణయించింది. త్వరలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జలశక్తిశాఖ రెండు రాష్ట్రాలు, కృష్ణా, గోదావరినదీ యాజమాన్య బోర్డులకు సమాచారం పంపింది. సమావేశ అజెండా కోసం అంశాలు పంపాలని కోరింది. రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు రాకుండా.. వచ్చిన పరిష్కరించుకునే దిశగా.. కలిసి చర్చించుకునేలా..అపెక్స్ కౌన్సిల్ను ప్రతిపాదించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఈ అపెక్స్ కౌన్సిల్లో ఉంటారు. అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన తర్వాత ఒక్క సమావేశం జరిగింది.
2016 సెప్టెంబర్ 21న ఢిల్లీలో జరిగిన సమావేశానికి చంద్రబాబు, కేసీఆర్ హాజరయ్యారు. అప్పుడు తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై చర్చించినప్పటికి ఆశించిన మేర ఫలితాలు మాత్రం రాలేదు. అప్పట్నించి రెండో సమావేశం జరగలేదు. ఏదైనా సమస్య వస్తే.. ముందుగా రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్లు, తరువాత కార్యదర్శులు, అనంతరం ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ మంత్రులతో సమావేశాలు నిర్వహిరచుకోవాల్సి ఉంటుంది. అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో కూడిన అపెక్స్ కౌన్సిల్ రంగంలోకి దిగుతుంది. రెండు రాష్ట్రాల విభజన జరిగినప్పట్నించి గోదావరి, కృష్ణా జలాలు, వాటిపై ఉన్న ప్రాజెక్టులపై వివాదాలు పెరుగుతూనే ఉన్నాయి. కేసీఆర్ – జగన్ మధ్య స్నేహంతో అన్నీ సమసిపోతాయనుకున్నారు కానీ.. ఏడాదిలోపే.. అలాంటి పరిస్థితి లేదని క్లారిటీ వచ్చేసింది.