మూడింట రెండు వంతుల మంది ఫిరాయిస్తే ఫిరాయింపుల చట్టం వర్తించదు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పతనానికి సంబంధించి ఆ లాంఛనం కూడా పూర్తయింది. తెలంగాణలో మరొక తెలుగుదేశం ఎమ్మెల్యే తెరాసలో చేరడానికి నిర్ణయించుకున్నారు. నియోజకవర్గ ప్రగతి కోసమే… తనను గెలిపించిన ప్రజల కోసమే అధికార పార్టీలో చేరుతున్నా అని ఆయన ప్రకటించారు. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి , తాను తెరాసలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి హైదరాబాద్ కు రాగానే తన నియోజకవర్గం గురించి ఆయనతో చర్చించి పార్టీలో చేరిపోతానని వెల్లడించారు.
20 నెలల పదవీ కాలంలో తన నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయానని ఆవేదన ఉన్నదన్న రాజేందర్ రెడ్డి నియోజకవర్గం కోసమే తెరాసలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. పార్టీ సమావేశం నిర్వహించి.. 2019 లో అధికారంలోకి వచ్చే స్థాయిలో తెలుగుదేశం పార్టీ తప్పకుండా బలపడుతుందని అంటూ.. తెలుగుదేశం శ్రేణులకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు భరోసా కల్పించే ప్రయత్నం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మరొక ఎమ్మెల్యే ఫిరాయింపు నిర్ణయం తీసుకోవడం విశేషం.
తెలంగాణలో తెలుగుదేశం తరఫున 15 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 9 మంది తెరాసలో ఉన్నారు. 2/3 వంతుల మంది ఫిరాయిస్తే గనుక.. వారిమీద ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయడం కూడా కుదరదు అనే నిబంధన ఒకటి చర్చల్లో ఉంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఎమ్మెల్యేలు ఎవరైనా చేరుతారేమో అని అంతా ఊహిస్తున్నారు. ఎర్రబెల్లి మాత్రం ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఈ నిర్ణయం వెలువరించడం విశేషం. దీంతో ఆ పది మంది కలిసి శుక్ర లేదా శని వారాల్లో తెలంగాణ అసెంబ్లీ స్పీకరును కలిసి తెలంగాణ తెదేపాను తెరాస లో విలీనం అవుతున్నట్లు గుర్తించాల్సిందిగా కోరే అవకాశం ఉంది. ఈ మేరకు రాజేందర్ రెడ్డి.. హైదరాబాదులోని తాజ్ క్రిష్ణా హోటల్లో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లను కలిసి తాను పార్టీలో చేరే విషయం నిర్ధరించినట్లు వార్తలు వస్తున్నాయ్. మొత్తానికి తెలుగుదేశానికి ఇప్పటికే పతనం తేలిపోయినట్టే. కాకపోతే.. ఇంకా వారికి కొన్ని దెబ్బలు వేచి ఉన్నాయని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.