రాజధాని అమరావతిలో ఉండటానికి ఉంటుందని ఓ ఫ్లాట్ బుక్ చేసుకున్నారు వాళ్లు. స్వయంగా సీఆర్డీయేని హ్యాపినెస్ట్ పేరుతో ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు రాజధాని అమరావతిలో ఉండబోవడం లేదని.. ఏపీ సర్కార్ తేల్చేసింది. ఇక హ్యాపీనెస్ట్ వినియోగదారులు ఆ ఫ్లాట్లు ఏం చేసుకుంటారు..?. రాజధానిని మార్చాలనుకున్న ప్రభుత్వం ఇలాంటి ప్రాజెక్టుల్ని మాత్రం.. కొనసాగించాలని అనుకుంటోంది. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల కల్పన అన్నింటినీ నిలిపివేసిన సర్కార్.. ప్రజలు కొనుక్కున్న ఫ్లాట్లను మాత్రం నిర్మించాలని అనుకుంటోంది. ఇందు కోసం ఇచ్చిన కాంట్రాక్టును నిలిపివేసి మళ్లీ రివర్స్ టెండర్లను పిలిచింది.
అమరావతిలో ప్రజా నివాస సముదాయంగా, అత్యున్నత ప్రమాణాలతో సీఆర్డీఏ హ్యాపీనెస్ట్ను నిర్మించాలనుకుంది. నేలపాడు వద్ద 1200 అపార్ట్మెంట్లతో కూడిన ఈ బహుళ అంతస్థుల గృహ సముదాయం నిర్మాణానికి పునాదులు పడ్జాయి. ప్రభుత్వం మారడంతో.. ఆ టెండర్లను రద్దు చేసి.. రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్నారు. మొత్తం రూ.656.44 కోట్ల అంచనా వ్యయం తో బిడ్లను ఆహ్వానించింది. అయితే… ఫ్లాట్ల కొనుగోలుదారులెవరూ.. ఇప్పుడు ఆసక్తికరంగా లేరు. తాము కట్టిన అడ్వాన్స్ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని.. సీఆర్డీఏ కార్యాలయానికి పెద్ద ఎత్తున విజ్ఞాపనలు వస్తున్నాయి. రాజధానిగా అమరావతి ఉంటుందనే తాము అక్కడ ఫ్లాట్లు కొన్నామని.. రాజధానిని అక్కడి నుంచి తరలించాలనుకున్నప్పుడు తమకు ఎందుకనే వాదన వారు వినిపిస్తున్నారు. కానీ సీఆర్డీఏ మాత్రం.. పట్టించుకోవడం లేదు. నిర్మాణానికి రివర్స్ టెండర్లకు వెళ్లిపోతోంది.
ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాల నిర్మాణాలను నిలిపివేసింది. అక్కడ ఒక్క అసెంబ్లీ మినహాఏమీ ఉండే అవకాశం లేదు. అలాంటప్పుడు.. అక్కడ జనం నివాసం ఉండే అవకాశం కూడా లేదు. అందుకే.. ఎన్నారైలు.. ఫ్లాట్లు కొనుక్కున్న వారు.. తమ సొమ్ము తమకు ఇచ్చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం మారక ముందు.. అమరావతిలో ఐఏఎస్, ఐపీఎస్లకు కూడా ప్రభుత్వం స్థలాలిచ్చింది. ప్రభుత్వానికి వారు కూడా డబ్బులు కట్టారు. వారు కట్టిన డబ్బులు వడ్డీతో సహా వెనక్కి ఇచ్చేసి.. స్థల కేటాయింపులను.. ప్రభుత్వం రద్దు చేయాలనుకుంటోంది. కానీ.. హ్యాపీనెస్ట్ కొనుగోలుదారులకు మాత్రం.. వద్దన్నా ఇళ్లు కట్టిస్తామని ముందుకెళ్తోంది. ఇది హ్యాపీనెస్ట్ కొనుగోలుదారులకు మానసిక వేదన కలిగిస్తోంది.