సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ సర్కార్ విధించిన సస్పెన్షన్ను… హైకోర్టు కొట్టి వేసింది. ఆయనను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. సస్పెన్షన్ను ఖరారు చేస్తూ… సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పును కూడా హైకోర్టు పక్కన పెట్టింది. తనపై అక్రమంగా సస్పెన్షన్ వేటు వేశారని ఆరోపిస్తూ.. ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సస్పెన్షన్ ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తక్షణం విధుల్లోకి తీసుకుని.. సస్పెన్షన్ కాలంలో నిలిపివేసిన జీతభత్యాలు ఇవ్వాలని స్పష్టం చేసింది.
గత ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు కొత్త ప్రభుత్వంలో పోస్టింగ్ దక్కలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆయన వెయిటింగ్ లోనే ఉన్నారు. చివరికి ఈ ఏడాది ఫిబ్రవరి ఎనిమిదో తేదీన రాత్రి ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీస్ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారని… భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అతిక్రమణలు జరిగాయని ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ప్రజాప్రయోజనాలరీత్యా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.
అయితే ప్రభుత్వం చెప్పిన అక్రమాలేవీ తాను చేయలేదని… ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ ను ఆశ్రయించారు. అయితే క్యాట్ సస్పెన్షన్ పై స్టే ఇవ్వలేదు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి..కూడా సస్పెన్షన్ ను ధృవీకరిస్తూ.. సమాచారం అందింది. అయితే.. ప్రభుత్వం ఏ అభియోగాలను మోపి.. సస్పెన్షన్ విధించిందో..వాటి ఆధారాలతో నిర్ణీత గడువులోగా చార్జిషీట్ ఫైల్ చేయాలని సూచించింది. అయితే…అభియోగాలు నమోదు చేయని ప్రభుత్వం ఆగస్టు ఐదు వరకు.. సస్పెన్షన్ ను పొడిగిస్తూ.. నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. ఇప్పుడు.. హైకోర్టు సస్పెన్షన్ ఎత్తివేసి.. ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించడంతో.. ప్రభుత్వం ఏంచేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.