తెలంగాణ సీఎం కేసీఆర్ సినిమా షూటింగ్లు వచ్చే నెల నుంచి ప్రారంభించుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత మరో వారం.. రెండు వారాల్లో ధియేటర్లనూ ప్రారంభించుకునేందుకు అవకాశం కల్పిస్తారని ఇండస్ట్రీ వర్గాలు నమ్ముతున్నారు. ఒకటో తేదీ తర్వాత ప్రజా రవాణా అంతా సాధారణ స్థితికి చేరుకుంటుంది. లాక్ డౌన్ కొనసాగించే అవకాశం లేకపోవడంతో.. మాల్స్, ధియేటర్లకూ పర్మిషన్ వస్తుందని నమ్ముతున్నారు. కేంద్రం ఇచ్చినా..రాష్ట్రం కరుణించాల్సి ఉంటుంది.. కేసీఆర్ సానుకూలంగా ఉండటంతో ధియేటర్లు కూడా ఓపెన్ అవుతాయని పరిశ్రమ పెద్దలు నమ్ముతున్నారు. తనతో భేటీ అయిన సినీ ప్రముఖులకు కేసీఆర్ ఈ మేరకు భరోసా ఇచ్చారు.
సినిమా షూటింగ్లు, రీ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని … వీలైనంత తక్కువ మందితో షూటింగ్లు నిర్వహించుకోవాలని కేసీఆర్ సూచించారు. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తక్కువ మందితో, ఇండోర్లో చేసే వీలున్న పనులు మొదట ప్రారంభించుకోవాలని.. జూన్లో సినిమా షూటింగులు ప్రారంభించాలన్నారు. చివరగా పరిస్థితిని బట్టి సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్తో భేటీపై చిరంజీవి సంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా, టీవీ, డిజిటల్ మీడియా సమస్యలపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారని… సినీ కార్మికులకు ఊరట కలిగేలా నిర్ణయం తీసుకుంటారని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ ఈ విషయంలో సినీ పరిశ్రమకు వీలైనంతగా సాయం చేస్తున్నారు. పలుమార్లు సినీ పెద్దలతో భేటీ అయ్యారు. విధివిధానాలు ఖరారవ్వగానే..సినిమాలు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఎక్కువ మందితో షూటింగ్ చేసే సీన్లు తక్కువ ఉంటాయని… తక్కువ మందితో షూటింగ్ చేసేవే ఎక్కువ ఉంటాయని.. అలాంటి వాటిని చిత్రీకరించుకునే అవకాశం ఇవ్వాలని రాజమౌళి ముందు నుంచీ తన అభిప్రాయాన్ని చెబుతున్నారు. దీనికే కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది.