నిదానమే ప్రదానం అనేది శేఖర్ కమ్ముల నమ్మిన సూత్రం. అందరిలా పరుగులు పెట్టడం ఆయనకు నచ్చదు. ఓ సినిమా పూర్తయ్యాక, కాస్త గ్యాప్ తీసుకుని, మరో కథ రాసుకుని, అప్పుడ మళ్లీ టచ్‌లోకి వస్తారు. సినిమా జరుగుతున్నప్పుడే మరో సినిమాకి కమిట్మెంట్ ఇవ్వడం చాలా అరుదు. అయితే `లవ్ స్టోరీ` ఇంకా సెట్స్‌పై ఉండగానే.. మరో సినిమాని ప్రకటించేశారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా `లవ్ స్టోరీ`. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఏసియన్ సునీల్ నిర్మాత. తన తదుపరి సినిమా కూడా శేఖర్ కమ్ముల ఇదే బ్యానర్లో చేయబోతున్నారు. ఇందులో ఓ అగ్ర కథానాయకుడు నటిస్తారని సమాచారం. స్క్రిప్టు పనులు కూడా మొదలైపోయాయి. మరో పదిహేను రోజులు షూటింగ్ చేస్తే.. లవ్ స్టోరీ పూర్తయిపోతుంది. ఆ వెంటనే… ఈ సినిమాని పట్టాలెక్కిస్తారు.