తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకే సారి అన్ని పనులు పెట్టుకోరు. ఒక్క సారి ఒక అంశాన్ని టేకప్ చేస్తే.. దానికి ఓ రూపు ఇచ్చే వరకూ విశ్రమించరు. మొన్నటిదాకా కరోనాపై దృష్టి పెట్టిన ఆయన ఇప్పుడు.. నియంత్రిత వ్యవసాయం విధానంపై దృష్టి పెట్టారు. దాదాపుగా ప్రతీ రోజూ.. సమీక్షలు చేస్తున్నారు. అధికారులతో చేసే సమీక్షలు వేరు. ఆయా రంగాల నిపుణులను పిలిచించి.. అభిప్రాయాలు తెలుసకుని.. సలహాలు తీసుకుని వాటిని నియంత్రిత వ్యవసాయ విధానంలో భాగం చేయాలనుకోవడం వేరు. అధికారులకు తాను చెప్పాల్సింది చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు.. నిపుణుల నుంచి సలహాలు తీసుకుంటున్నారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం నిర‌్వహించిన సమావేశానికి ప్రొఫెసర్ నాగేశ్వర్, వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రవీణ్ రావు, అగ్రి బిజినెస్ కాలేజ్ ప్రిన్సిపాల్ సీమా, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ శ్రీనివాసచారిలతో పాటు పలువుర్ని ఆహ్వానించి మాట్లాడారు.
మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులు వచ్చేలా, వ్యవసాయాధారిత పరిశ్రమలకు నిరంతరం ముడి సరుకు అందించే విధంగా… వేసిన పంటంతా సంపూర్ణంగా అమ్ముడుపోయేలా తెలంగాణ వ్యవసాయం రూపురేఖలు మారాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. తెలంగాణలో వ్యవసాయానికి అనుకూలతలున్నాయని.. ప్రజల ఆదాయానికి వ్యవసాయమే ప్రధానం..కాబట్టి ఎక్కువ దృష్టి వ్యవసాయం మీదనే పెట్టాలి. దీర్ఘకాలిక వ్యూహంతో రైతులకు మార్గదర్శకం చేయాల్సి ఉందన్నది కేసీఆర్ అభిప్రాయం. పండించిన పంటను యధావిధిగా అమ్మడం కాకుండా.. వాల్యూ యాడ్ చేయడానికి ఏం చేయాలన్నదానిపై కేసీఆర్ నిపుణుల సలహా తీసుకున్నారు.
ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకంలో కూడా మార్పు రావాల్సి ఉందని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. ప్రస్తుతం రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల కేవలం వ్యాపారుల మాట నమ్మి వాటిని వాడుతున్నారని.. తగిన మోతాదులో ఎరువులు, పెస్టిసైడ్స్ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు రైతులకు తెలిపేలా.. కార్యచరణ ఉండాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమయింది. క్రాప్ కాలనీలు ఉన్నచోటనే ఆ పంటకు సంబంధిచిన అగ్రో ఇండస్ట్రీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు అయితే.. రైతులకు ఇబ్బందులు ఉండవని నిర్ణయించారు. నియంత్రిత వ్యవసాయ విధానం విషయంలో కేసీఆర్ మరిన్ని గట్టి నిర్ణయాలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.