ప్రభాస్ – నాగ అశ్విన్ కాంబోలో వైజయంతీ మూవీస్ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. దాదాపు 250 కోట్ల సినిమా ఇది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ఈలోగా బాలీవుడ్‌లో ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. బాహుబలి తరవాత.. ప్రభాస్ అక్కడ కూడా ఓ స్టార్ అయిపోయాడు. సాహో కూడా హిందీలో బాగానే ఆడింది. అందుకే ప్రభాస్ తదుపరి సినిమాపై అక్కడ ఫోకస్ పెరిగింది. రాధాకృష్ణ సినిమా బాలీవుడ్‌ని కదిలించలేదు గానీ, నాగ అశ్విన్ ప్రాజెక్టు మాత్రం బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా కోసం ఓ బాలీవుడ్ స్టార్ కథానాయికని ఎంచుకుంటారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. అలియాభట్, కత్రినా.. ఇలా చాలా పేర్లు పరిశీలనలోకి వస్తున్నాయి. అక్కడి నుంచి మరింత మంది తారాగణాన్ని దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఈ సినిమాతో టై- అప్ అవ్వాలని ఓ ప్రముఖ బాలీవుడ్ సంస్థ గట్టిగా ప్రయత్నిస్తోందని సమాచారం. వైజయంతీ మూవీస్ కూడా అందుకు సిద్ధంగానే ఉంది. అన్నీ కుదిరితే.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఓ అధికారిక ప్రకటన వైజయంతీ మూవీస్ జారీ చేసే అవకాశం ఉంది.