షూటింగుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో చిత్రసీమలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేయగానే – షూటింగులు మొదలెట్టుకోవడానికి సమాయాత్తం అవుతున్నారంతా. `వకీల్ సాబ్` కూడా సెట్లోకి వెళ్లడానికి ఉత్సాహంగా ఉంది. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. మే 15న విడుదల కావల్సింది. కానీ.. లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. మరో 30 రోజులు షూటింగ్ చేస్తే, సినిమా పూర్తవుతుంది. అందుకే.. యుద్ధ ప్రాతిపదికన మిగిలిన సన్నివేశాల్ని లాగించేయాలని దిల్ రాజు భావిస్తున్నారు. ఈ విషయమై టీమ్‌తో ఇప్పటికే చర్చలు మొదలెట్టేశారు. ఇప్పుడు కావల్సిందల్లా పవన్ కల్యాణ్ భరోసా మాత్రమే. జూన్ నుంచి తమకు కాల్షీట్లు కావాలని దిల్ రాజు పవన్‌ని అడిగారని, పవన్ కూడా సానుకూలంగా స్పందించాడని తెలుస్తోంది. పవన్ చేతిలో ఇది కాకుండా మరో రెండు సినిమాలున్నాయి. వకీల్ సాబ్ పూర్తయితే గానీ.. క్రిష్ సినిమా మొదలవ్వదు. అందుకే వకీల్ సాబ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ కూడా అనుకుంటున్నాడట. ఈ సినిమాకి సంబంధించి కోర్ట్ సీన్లు తీయాల్సివుంది. ఎలాగూ సెట్లో పని. రాత్రీ, పగలూ తేడా లేకుండా షూటింగ్ పూర్తి చేస్తే… తక్కువ సమయంలోనే సినిమాని ముగించొచ్చు. దసరాకి ఈ సినిమాని విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే.. దానికంటే ముందే ఈ సినిమాని విడుదల చేయాలని దిల్ రాజు ప్రణాళికలు వేసుకుంటున్నారు.