బిల్డ్ ఏపీ పేరుతో ఆంధ్రప్రభుత్వ ప్రభుత్వానికి చెందిన మార్కెట్లు, ఉద్యోగుల క్వార్టర్లను అమ్మేయడానికి వేలం పాటలు ప్రారంభించబోతున్న ఏపీ సర్కార్… ఇప్పుడు.. తిరుమల శ్రీవారి ఆస్తులనూ అమ్మకానికి పెట్టింది. తమిళనాడులో 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయానికి కమిటీలు ఏర్పాటు చేసింది. ఆస్తుల విక్రయం కోసం టీటీడీ పాలకమండలిలోనే తీర్మానం చేసి మరీ.. 8 కమిటీలు ఏర్పాటు చేశారు. ఆస్తుల విక్రయానికి బహిరంగ వేలం నిర్వహించాలని నిర్ణయించారు. ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసే అధికారాలను అధికారులకు కట్టబెట్టారు. పాలకమండలి సమావేశంలో ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారో కానీ..గుట్టుగా ఉంచారు.. కమిటీలు నిర్ణయించిన తర్వాత వెలుగులోకి వచ్చింది.
లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో పడిన టీటీడీ ఆస్తులను అమ్మేస్తుందేమోనని చాలా మంది అనుకుంటారు. టీటీడీకి ఇసుమంత కూడా అర్థిక సమస్యలు లేవు. మరో ఆరు నెలల పాటు లాక్ డౌన్ విధించినా…రోజువారీ ఖర్చులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్వయంగా టీటీడీ చైర్మనే చెప్పారు. అయినప్పటికీ.. ఆస్తుల్ని వేలం వేయడానికి కారణం ఏమిటంటే.. ఆ ఆస్తుల్ని నిర్వహించడానికి కష్టంగా ఉందట. నిర్వహించలేకపోతున్నామని చెప్పి తెగనమ్మేస్తున్నారు టీటీడీ పెద్దలు. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రమేయం లేకుండా.. ఇలా జరిగే అవకాశం లేదు.
చెన్నైలో ఎలాంటి పత్రాలు లేని.. అమరావతి ఆలయానికి చెందిన సదావర్తి సత్రం భూములను… కోర్టు కేసులను కొనుగోలు చేసుకునేవారే పరిష్కరించుకోవాలన్న లక్ష్యంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం అమ్మాలనుకుంటే..రచ్చ రచ్చచేసి..కోర్టుకెళ్లి నిలిపివేయించిన వైసీపీ నేతలు..ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా తిరుమల శ్రీవారి ఆస్తుల్నే అమ్మేయడం కలకలం రేపుతోంది. శ్రీవారికి దాతలు వివిధ సందర్భాల్లో విరాళంగా ఆస్తులు ఇస్తూంటారు. ఆ ప్రకారంగా వచ్చిన ఆస్తులను అమ్మేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను తమ వారికి కట్ట బెట్టేందుకే బిల్డ్ ఏపీ అంటున్నారని గట్టి విమర్శలు వస్తున్నాయి..ఇప్పుడు టీటీడీ ఆస్తులను తమవారికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. విమర్శించేవారు సహజంగానే వస్తారు.