గాడ్సే వివాదంతో పాటు.. ఇతర అంశాలపై నాగబాబు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్న వివాదాస్పద అభిప్రాయాలతో జనసేనకు సంబంధం లేదని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధికార ప్రతినిధులు.. అధికారిక వేదికల మీద.. అధికార సోషల్ మీడియా అకౌంట్లలో వ్యక్తం చేసే అభిప్రాయాలు మాత్రమే.. జనసేన పార్టీ అభిప్రాయాలుగా భావించాలని మిగతా ఎవరు మాట్లాడినా వారి వ్యక్తిగత అభిప్రాయాలుగానే భావించాలని పవన్ కల్యాణ్ అన్నారు. నాగబాబు.. నాథూరాం గాడ్సే పుట్టిన రోజున..ఆయనను నిజమైన దేశభక్తునిగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. ఆయన దేశభక్తుడైతే.. ఆయన హత్య చేసిన మహాత్మాగాంధీ దేశద్రోహినా అన్న విమర్శలు ఉద్ధృతంగా వచ్చాయి.
అయితే.. నాగబాబు.. ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాను గాడ్సేను దేశభక్తుడు అనిచెప్పాను కానీ..గాంధీని తక్కువ చేయలేదని వాదించారు. జనసేన పార్టీ నేతలకు నాగబాబు వ్యవహారం ఇబ్బందికరంగా మారింది. సమర్థించాలో..వ్యతిరేకించాలో తెలియక సతమతమయ్యారు. నాగబాబు సైలెంట్ గా ఉంటే.. ఈ వివాదం మరుగున పడి ఉండేదమో కానీ.. ఆయన దీన్ని కొనసగించాలనుకుంటున్నారు. తాజాగా.. భారత కరెన్సీ నోట్లపై ఒక్క మహాత్మగాంధీనే ఎందుకు ఉంచుతున్నారని.. ఇతర స్వాతంత్రసమరయోధుల ఫోటోలు కూడా వేయాలని డిమాండ్ చేస్తూ..మరో ట్వీట్ చేశారు.
గాంధీజి బతికి ఉంటే.. అదే చెప్పావారని కవరింగ్ ఇచ్చారు. ఏ దేశానికైనా స్వాతంత్ర సమరయోధులు.. చాలా మంది ఉంటారు. జాతిపితగా ఒక్కరినే భావిస్తారు. మన దేశంలో మహాత్ముడ్ని భావిస్తున్నారు. అందుకే కరెన్సీనోట్లపై ఫోటో పెడుతున్నారు. ఇప్పుడు మహాత్ముడు ఆ గౌరవానికి పనికిరారన్నట్లుగా నాగబాబు ట్వీట్ ఉంది. ఈ వివాదం ఇంతటితో ఆగదని..జనసేనను చుట్టేస్తుందని కంగారు పడిన పవన్ కల్యాణ్.. ఈ మేరకు నాగబాబువి వ్యక్తిగత అభిప్రాయాలు అని చెబుతూ ఖండన ప్రకటన విడుదల చేశారు. మరి నాగబాబు ఏమంటారో..?