ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలనలో.. పాలనా పరంగా అతి పెద్ద లోపం ఆర్థిక నిర్వహణలోనే కనిపిస్తోంది. ఎక్కడా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పాలన సాగుతోంది. పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నారు. ఆస్తులు అమ్ముతున్నారు. కానీ.. ఎక్కడా అభివృద్ది పనులు కనిపించడం లేదు. సంపద సృష్టి అసలు జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మొదలే అంతంతమాత్రం. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల కోసం నిధులు వెచ్చించి.. ఎన్నికల తాయిలాలు ఇచ్చి వెళ్లింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అప్పులే స్వాగతం పలికాయి. కానీ జాగ్రత్తగా ఆర్థిక పునాదుల్ని పటిష్ట పరుచుకోవాల్సిన ప్రభుత్వం.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ.. ఎంత వడ్డీఅయినా సరే లెక్క చేయకుండా తీసుకుంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది.
ఏడాదిలో రూ.77 వేల కోట్ల అప్పు..!
తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల పాలనలో.. చేసిన అప్పు.. రూ. లక్షా అరవై వేల కోట్ల రూపాయలు. ఈ అప్పుకే… విపక్ష పార్టీ నేతగా.. జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబుపై విరుచుకుపడేవారు ఇష్టం వచ్చినట్లుగా… అప్పులు చేసి. ప్రజలపై భారం మోపుతున్నారని అనేవారు. దాంతో.. చాలా మంది ఆయన అప్పులు చేయరేమో అని అనుకున్నారు. కానీ పదవి చేపట్టిన ఒక్క ఏడాదిలో.. రూ. 77వేల కోట్లకుపైగా అప్పు చేసి.. సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ లెక్కన అప్పులు చేస్తే.. ఐదేళ్లలో నాలుగు లక్షల కోట్లకుపైగా అప్పు.. ప్రజల నెత్తిపైన పడుతుంది. ఇంత అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి… మరి వాటితో సంపద సృష్టించారా.. అంటే.. అదీ లేదు. రూ. 77వేల కోట్ల అప్పుడు ఎటు పోయిందో ఎవరికీ తెలియదు. సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టినది అంత మొత్తం ఉండదు. రైతు భరోసా కింద.. రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయలు. ఇలా 45 లక్షల మంది రైతులకు ఇస్తున్నారు. మిగతా ఆరు వేలు కేంద్రం నేరుగా రైతులకే ఇస్తుంది. ఈ మొత్తం నాలుగు వేల కోట్లు. తర్వాత అమ్మఒడి పేరుతో.. మరో 40 లక్షల మందికి పదిహేను వేల రూపాయలు ఇచ్చారు. ఈ మొత్తం అరు వేల కోట్ల రూపాయలు. ఈ రెండు పథకాలే భారీవి. ఇక రెండు లక్షల మంది డ్రైవర్లకు పదివేలు ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ కింద.. పధ్నాలుగు వందల కోట్లు విడుదల చేశారు. విద్యాదీవెన, వసతి దీవెనకు నిధులిచ్చారు. అంతే ఇ ఏ పథకమూ అమలు చేయలేదు. అంటే.. మొత్తంగా 82 లక్షల మందికి అటూ ఇటూగా పది వేల కోట్ల రూపాయలు మాత్రమే పంచారు. కానీ ఈ సంక్షేమం పేరుతో.. ప్రభుత్వం చేసిన అప్పులు ఎంతో తెలుసా… పంచిన దాని కన్నా.. ఏడు రెట్లు ఎక్కువ.
బడ్జెట్లో చెప్పిన దాని కన్నా రెట్టింపు అప్పు…!
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అందులో 35వేల కోట్ల వరకూ అప్పు తీసుకుంటామని ప్రతిపాదించారు. కానీ.. ఆర్థిక సంవత్సం ముగిసే సరికి.. అంతకు రెండింతలు అప్పు చేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ప్రభుత్వం చేసిన అప్పు 77వేల కోట్లు. ఓ ఆర్థిక సంవత్సరంలో ఓ రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీగా అప్పు చేయడం.. చరిత్రలో లేదు. ఆర్బీఐ బాండ్లు, ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచుకుని వాడుకోవడం… ఉద్యోగుల నిధులు వాడుకోవడం.. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా నిధులు తీసుకోవడం ఇలా.. అప్పులు పుట్టడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా.. వదిలి పెట్టలేదు. ఇలా.. మొత్తంగా 77వేల కోట్లు అప్పు చేసింది. ఇంత అప్పు చేసినా.. ప్రజలకు మేలు చేసేవి ఏవైనా చేశారా అంటే లేదు. కనీసం బడ్జెట్ లక్ష్యాలను కూడా అందుకోలేదు.
ఏడాదిలో ప్రతి మనిషిపై రూ. 15వేల అప్పు…!
పాత అప్పులు కాకుండా…ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్క ఏడాదిలో ఒక్కొక్క తలపై అక్షరాలా పదిహేను వేల నాలుగు వందల రూపాయలు అప్పులు చేశారు. ఐదు కోట్ల మంది తలపై…మొదటి పది నెలల్లోనే పదిహేను వేల నాలుగు వందల అప్పు పెట్టారు. గతంలో ప్రభుత్వాలు అప్పులు చేసి.. సంపదను సృష్టించేవి. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టేవారు. కానీ.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ భిన్నంగా వ్యవహరిస్ోతంది. ఏడాదిలో 77వేల కోట్లు అప్పు చేసినా.. పోలవరం ఎక్కడిదక్కడే ఉంది. అమరావతిని నిర్వీర్యం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ఒక్క పని జరగలేదు. ఏపీలో ఎక్కడా అభివృద్ధి పనులే జరగడం లేదు.
ఇప్పుడు భూముల అమ్మకాలపై దృష్టి..!
బ్యాంకుల నుంచి.. బాండ్ల నుంచి… తెచ్చుకోగలిగినంత అప్పు తెచ్చుకున్న సర్కార్.. ఇక మందు అలాంటి చాన్సులు లేవనుకుందేమోకానీ.. విలువైన భూములను అమ్మకానికి పెట్టేసింది. గుంటూరు నడిబొడ్డున ఉన్న మార్కెట్ ను .. విశాఖలో ఉన్న ఉద్యోగుల క్వార్టర్స్‌ను అమ్మేస్తోంది. విశాఖలో తుపాను షెల్టర్లను.. రాజమండ్రి జైల్‌ను కూడా అమ్మేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. తాజాగా టీటీడీ ఆస్తులు కూడా అమ్ముతున్నారు. వీటన్నింటినీ అమ్మి.. సంక్షేమ పథకాల కింద.. డబ్బులు పంచాలని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి…!
ఆర్థిక నిర్వహణలో జీరో మార్కులు..!
ఎక్కడికక్కడ అప్పులు తీసుకొచ్చి పథకాలు అమలు చేస్తున్నా… పరిస్థితి మాత్రం దారుణంగా మారిపోతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఖర్చులు తగ్గిపోవడమే కాదు… రెండు నెలల పాటు ఉద్యోగుల జీతాలు సగమే చెల్లించారు. కానీ కేంద్రం నుంచి మాత్రం దండిగా నిధులు వస్తున్నాయి. ప్రభుత్వాలు కట్టాల్సిన చెల్లింపులన్నీ.. తర్వాత కట్టొచ్చని ఆర్బీఐనే ఆఫర్ ఇచ్చింది. ఇవన్నీ కలసి రావడంతో.. మిగిలే డబ్బులను.. ప్రభుత్వం మరో విధంగా వాడుకుంటోంది. కానీ రేపటి పరిస్థితి మాత్రం భయంకరంగా కనిపించబోతోంది.