ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాలేయ సంబంధిత సమస్యతో సతమతమవుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఆయనకు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. సుద్దాల తనయుడు అర్జున్ తేజ్ కాలేయ దానం చేశారు. దాంతో సుద్దాల అశోక్ తేజకు జరిగిన ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. శనివారం ఉదయం మొదలైన ఆపరేషన్ సాయింత్రం వరకూ సాగిందని, సుద్దాల, ఆయన తనయుడు ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. గీత రచయితగా సుద్దాల బ్రాండ్ ప్రత్యేకం. దేశభక్తి, జాన పద, భావోద్వేగ పాటలకు ఆయన ప్రసిద్ధి. `ఠాగూర్`లోని నేను సైతం ప్రపంచాగ్నికి పాటకు ఉత్తమ గేయ రచయితగా జాతీయ పురస్కారం పొందారు. శ్రీశ్రీ తరవాత ఆ ఘనత సాధించిన తెలుగు రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు.