మైహోమ్ ఇండస్ట్రీస్‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వానికి అత్యంత దగ్గర అయిన వ్యక్తికి చెందిన కంపెనీపై.. ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎంపీ దూకుడుగా వెళ్లడం అంటే..ఆషామాషీ కాదనే అంటున్నారు. విదేశీ కంపెనీలతో కలిసి పెద్ద ఎత్తున దేశ సంపదను కొల్లగొట్టారని.. అరవింద్ తీవ్ర విమర్శలే చేశారు. అయితే అవి నోటి మాటగా చేసినవి కావు.. పత్రాలు కూడా విడుదల చేశారు. ఈ వ్యహారంపై టీఆర్ఎస్ నేతలు పెద్దగా మాట్లాడలేదు కానీ..టీవీ9 మాత్రం.. ఉలిక్కిపడింది. మైహోమ్ తరపున ఆ చానల్ లో సమర్థన కథనాలు పెద్ద ఎత్తున వచ్చాయి.
నిజామాబాద్ ఎంపీ అబద్దాలు చెబుతున్నారని చెబుతూ.. ఆయనపై తిట్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ.. తమ వాదనకు తక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఈ విషయంలోనూ..వెంటనే ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మైహోమ్ అక్రమాలను కప్పి పుచ్చుకోవడానికి .. ఆగ్రూప్ నకు చెందిన చానల్ చాలా తంటాలు పడుతోందని..కానీ వాస్తవాలు మాత్రం ఇలా ఉంటాయంటూ..మరికొన్ని పత్రాలు విడుదల చేశారు.
మైహోమ్ సంస్థ.. నల్లగొండ జిల్లాలో భూదాన్ భూముల్ని ఆక్రమించిన కలెక్టర్ ఇచ్చిన నివేదికను..అరవింద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మైహోమ్ తరపున దీన్ని కూడా డిఫెండ్ చేయడం.. టీవీ9కి తప్పకపోవచ్చు.ఇప్పుడు టీవీ9 ఇండిపెండెంట్ జర్నలిస్టుల చేతుల్లో లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఉంది. వారి వ్యాపార ప్రయోజనాల్ని..వారి అక్రమాలను..ఎప్పటికప్పుడు సమర్థిస్తూ.. బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.