లాక్ డౌన్ తర్వాత తొలి సారి ఏపీకి వెళ్లాలనుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ..చిక్కులు తప్పేటట్లు లేవు. సోమవారం విశాఖ వెళ్లడానికి ఆయన అటు తెలంగాణ ప్రభుత్వానికి.. ఇటు ఆంధ్రప్రభుత్వానికి పర్మిషన్ కోసం దరఖాస్తు చేశారు. తెలంగాణ డీజీపీ నుంచి వెంటనే… అప్రూవర్ వచ్చింది. కానీ ఏపీ డీజీపీ నుంచి మాత్రం ఇంత వరకూ సమాధానం రాలేదు. దీనిపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సమయంలోనే… హోంమంత్రి సుచరిత.. అసలు చంద్రబాబు దరఖాస్తు చేసుకోలేదని ప్రకటించేశారు. శైలజానాథ్, కన్నా విశాఖ వెళ్లి వచ్చారు.. వాళ్లకు లేని అభ్యంతరాలు చంద్రబాబుకు ఎందుకని సుచరిత చెప్పుకొచ్చారు.
చంద్రబాబు దరఖాస్తు చేసుకుంటే వెళ్లేందుకు అనుమతి ఇస్తామన్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ వెళ్లి… ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శించిన అనంతరం… విశాఖ నుంచి అమరావతికి రోడ్డు మార్గంలో వెళ్లాలని చంద్రబాబు అనుకుంటున్నారు. గతంలో చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళ్తే..అక్కడ వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.పోలీసులు వారిని చెదరగొట్టకపోగా.. చంద్రబాబును వెనక్కి పంపారు. ఈ ఘటనపై హైకోర్టుల్లో కేసులు నమోదయ్యాయి.
పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు.. కూడా వైసీపీ నేతలు చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి ఇంకేదో ప్లాన్ అమలు చేస్తున్నారని అందుకే.. ధరఖాస్తు చేసుకోలేదని ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఒక వేళ..దరఖాస్తు చేసుకోలేదనే కాన్సెప్ట్కే.. ఏపీ సర్కార్ పరిమితమైతే… చంద్రబాబు ఏంచేస్తారన్నది ఉత్కంఠగా మారింది.