కేసీఆర్ను కలిసి షూటింగ్ల అనుమతి కోసం విజ్ఞప్తి చేసిన చిరంజీవి …తాజాగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కూడా ఫోన్లో మాట్లాడారు. దీనికి కారణం… ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్లకు సింగిల్ విండో అనుమతులు మంజూరు చేస్తూ.. ఉత్తర్వులు ఇవ్వడమే. ఇలా జీవో ఇచ్చినందుకు చిరంజీవి.. ముఖ్యమంత్రి జగన్కు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పారు. అప్పుడే సీఎం జగన్.. అందరూ వస్తే.. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై చర్చించుకుందామనన్నారు. దాంతో చిరంజీవి కూడా.. లాక్ డౌన్ ముగిసిన తరవాత సినీ పరిశ్రమలోని అన్ని విభాగాలకు చెందిన పెద్దలతో కలసి వస్తానని…చెప్పారు.
అదే విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియాలో ప్రకటించారు. సీఎం జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి ముందుగా జగన్ ను కలిశారు. ఆయన తన సినిమా సైరా నరిసంహారెడ్డిని చూడాలని ఆహ్వానించేందుకు వెళ్లారు. అప్పుడు సాదర స్వాగతాన్ని చిరంజీవి పొందారు. ఆ తర్వాత ఒకటి,రెండు సందర్భాల్లో చిరంజీవి, జగన్ భేటీ జరగబోతోందని ప్రచారం జరిగినా… కుదరలేదు. ఏపీలో సినిమా షూటింగ్లకు అనుకూలమైన వాతావరణం ఏర్పర్చాలన్న లక్ష్యంతో ఉన్న జగన్… చిరంజీవి ద్వారా.. ఇండస్ట్రీని ఆకర్షించాలని అనుకుంటున్నారు.
ప్రస్తుతానికి చిరంజీవినే.. ఇండస్ట్రీని లీడ్ చేస్తున్నారు. కేసీఆర్ తో భేటీ సమయంలోనూ చిరంజీవే ప్రముఖ పాత్ర పోషించారు. జగన్ తో భేటీ సమయంలోనూ ఆయనే లీడర్ గా వ్యవహరించనున్నారు. జగన్ తో భేటీ అనుకున్నట్లుగా జరిగితే.. ఏపీలో సినిమా షూటింగ్లు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.