కోర్టులపై సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్నాయి. రాజధాని తరలింపునకు బహిరంగంగా మద్దతు పలుకుతున్న నందిగం సురేష్.. సచివాలయం సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని తన ఆనుచరులతో ఆక్రమించుకున్నారంటూ.. టీడీపీ నేత వర్ల రామయ్య కొన్ని పత్రాలు విడుదల చేసి..సీఆర్డీఏ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తుళ్లూరు మం. మందడంలో సచివాలయానికి కిలోమీటర్ దూరంలో ఉన్న భూమిని ఎంపీ అనుచరులు ఆక్రమించుకున్నారని వర్ల రామయ్య ఆరోపించారు.
సీఆర్డీఏకు చెందిన భూమిని కబ్జా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని.. విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఈ అంశంపై ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, శ్రావణ్ కుమార్‌లతో నిజ నిర్ధారణ కమిటీని నియమించింది. మందడంలో ఎంపీ అనుచరులు ఆక్రమించిన భూముల్ని టీడీపీ నేతలు పరిశీలిస్తారు. రాజధాని ప్రాంతానికి చెందిన నందిగం సురేష్.. వైసీపీలో అనూహ్యంగా ఎదిగారు.
బాపట్ల టిక్కెట్ పొంది గెలిచి ఎంపీ అయ్యారు. అయితే.. ఆయన అనుచరుుల మొదటి నుంచి ఇసుక తరలింపు వ్యవహారాల్లో కీలకంగా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే ఉండవల్లిశ్రీదేవితో వివాదాలు సీఎం జగన్ వద్దకు కూడా వెళ్లాయి. ఇప్పుడు కొత్తగా భూకబ్జా ఆరోపణలు కూడా వస్తున్నాయి. వైసీపీ తరపున వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి సురేష్‌నే ఆ పార్టీ నాయకత్వం ముందు పెడుతోంది. మరి ఈ వివాదాలపై ఎలా స్పందిస్తుందో..?