జగ్గారెడ్డి అంటే ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ నేత. అధికారంలో ఉన్న కెసిఆర్ , ఆయన కుటుంబ సభ్యుల మీద పదునైన విమర్శలు చేయడానికి విపక్ష నేతలు భయపడుతూ ఉన్న సమయంలో కూడా జగ్గారెడ్డి మాత్రం కెసిఆర్ ని చీల్చి చెండాడడానికి ఏమాత్రం వెనుకాడే వారు కాదు. ఏమాత్రం భీతి లేకుండా అధికార పార్టీ మీద ఆయన చేసిన విమర్శలు ఆయనకు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. అయితే ఇదంతా గతం. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాస్ పోర్ట్ స్కాం లో ఆయన పై కేసులు నమోదు అవుతున్నాయి అంటూ వార్తలు వచ్చిన తర్వాత ఆయన వైఖరి మారిపోయినట్లు కనిపిస్తోంది. ప్రత్యేకించి ఇటీవలి కాలంలో కెసిఆర్ మీద పదునైన విమర్శలు చేయడం అనేది లేక పోగా , కెసిఆర్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన మై హోమ్ గ్రూప్ అధినేత, టీవీ9 అధినేత అయిన రామేశ్వరరావు మీద విమర్శలు వచ్చిన ప్రతిసారి జగ్గారెడ్డి తెరమీదకు వచ్చి ఆ విమర్శలను ఖండించడం విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తుంది. వివరాల్లోకి వెళితే..
టీవీ 9 వర్సెస్ ధర్మపురి అరవింద్:
తాజాగా బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ , టీవీ9 అధినేత మై హోమ్ రామేశ్వరరావు మీద సంచలన ఆరోపణలు చేశారు. జాతీయ సంపద అయినటువంటి ఖనిజ వనరులను సంస్థ దోచుకుందని, గనుల లీజులు దక్కించుకోవడంలో కూడా అక్రమాలకు పాల్పడింది అని, విదేశీ పెట్టుబడులకు సంబంధించి నిబంధనల ఉల్లంఘన జరిగిందని తీవ్ర విమర్శలు చేశారు. దానికి సంబంధించిన కొన్ని పత్రాలు కూడా విడుదల చేశారు. అయితే దీనిపై టీవీ9 కూడా వెంటనే కౌంటర్ అటాక్ ప్రారంభించింది. ధర్మపురి అరవింద్ రాజస్థాన్ లోని ఒక యూనివర్సిటీలో చదువుకున్నట్లు చూపించారని, ఆయన విద్యార్హతలు ఫేక్ అయివుండవచ్చని అంటూ టీవీ9 కథనాలు ప్రసారం చేసింది. ఒక ఫక్తు రాజకీయ పార్టీ స్పందించిన తీరులోనే టీవీ9 కూడా తమ యజమాని రామేశ్వరరావు తరపున వకాల్తా తీసుకుని స్పందించింది.
టీవీ9 రామేశ్వర రావు తరఫున జగ్గారెడ్డి వకాల్తా:
అయితే దీనికి తోడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధర్మపురి అరవింద్ మీద చేసిన విమర్శలను ఇవాళ టీవీ9 ప్రముఖంగా ప్రసారం చేసింది. అరవింద్ కు మతి తప్పిందని, పారిశ్రామికవేత్తలను ( అనగా మై హోమ్ రామేశ్వరరావు ని అని భావం) అరవింద్ బెదిరించడం తగదని, అరవింద్ తండ్రి డి ఎస్, తన తమ్ముడు మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయని జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిజెపి ఎంపి అయిన అరవింద్, టిఆర్ఎస్ మీద, ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న టీవీ 9 అధినేత మై హోమ్ రామేశ్వరరావు మీద విమర్శలు చేస్తే ఆగమేఘాలమీద జగ్గారెడ్డి తెర మీదకు ఎందుకు వచ్చాడు అని ప్రజలకు అంతుబట్టకుండా ఉంది. గతంలో రేవంత్ రెడ్డి టీవీ 9 మీద, మై హోమ్ రామేశ్వరరావు మీద ఇటువంటి ఆరోపణలే చేసినప్పుడు జరిగిన పర్యవసానాలు గుర్తున్న వారికి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు “deja vu” అనుభూతి కలిగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అప్పుడు కూడా రేవంత్ రెడ్డి రామేశ్వర రావు పై ఆరోపణలు చేసిన వెంటనే రేవంత్ రెడ్డి పై తీవ్రమైన వ్యతిరేక కథనాలను టీవీ9 ప్రసారం చేయడం, ఆ పై ఆగమేఘాల మీద తెరమీదకు వచ్చిన జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి తన పార్టీ యే అన్న విషయాన్ని కూడా పక్కనపెట్టి మరీ రేవంత్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేయడం, దాన్ని టీవీ9 ప్రముఖంగా ప్రసారం చేయడం గుర్తుండే ఉంటుంది.
అప్పుడు రేవంత్ రెడ్డి విషయంలోనూ, ఇప్పుడు ధర్మపురి అరవింద్ విషయంలోనూ మై హోమ్ రామేశ్వరరావు తరఫున వకాల్తా పుచ్చుకుని జగ్గారెడ్డి వాదించడం చూస్తున్న వారికి జగ్గారెడ్డి , టీవీ9 మీద ఈగ వాలనీయడం లేదు అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఆయన కూడా మై హోమ్ గ్రూప్ సంస్థ ఉద్యోగిగా మారిపోయాడా అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. మరోపక్క పాస్పోర్ట్ స్కామ్ లో అప్పట్లో జగ్గా రెడ్డి పేరు వినిపించిన దరిమిలా, ఆ వివరాలతో చానల్ పెద్దలు ఆయనను ఏమైనా బ్లాక్ మెయిల్ చేశారా అన్న అనుమానాలు కూడా కొందరిలో కలుగుతున్నాయి.
ఏది ఏమైనా జగ్గారెడ్డి టీవీ9 రామేశ్వరరావు మీద ఈగ వాలనీయక పోవడం జనాలకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటే, తమ యజమాని మీద ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ, ఆరోపణలు చేసిన వారి మీద టీవీ 9 వ్యక్తిగతంగా వ్యతిరేక కథనాలు ప్రసారం చేయడం, జగ్గారెడ్డి లాంటి వారిని తెరమీదకు తెచ్చి విమర్శలు చేయడం చూస్తుంటే టీవీ9 తెలివితేటలు కూడా జనాలను ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి.