మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనకు ఏపీ డీజీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మధ్యాహ్నం హోంమంత్రి సుచరిత చంద్రబాబు దరఖాస్తు చేసుకోలేదని మీడియాతో చెప్పడంతో… చంద్రబాబు పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే ఉద్దేశంలో లేదన్న ప్రచారం జరిగింది. అయితే.. సాయంత్రానికి పర్మిషన్ ఇస్తున్నట్లుగా డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖకు విమానంలో.. విశాఖ నుంచి… ఉండవల్లికి రోడ్డు మార్గం ద్వారా.. చంద్రబాబు వెళ్లడానికి డీజీపీ పర్మిషన్ ఇచ్చారు. అరవై ఐదు ఏళ్లు దాటిన వారు.. అప్రమత్తంగా ఉండాలని.. బయటకు రాకూడదన్న నిబంధనలు ఉన్నందున… తగిన జాగ్రత్తలు తీసుకోనాలని డీజీపీ తన అనుమతి పత్రంలో పేర్కొన్నారు. సోమవారం ఉదయం.. విమానంలో విశాఖ వెళ్లి అక్కడి నుంచి వెంకటాపురం వెళ్లి గ్యాస్ లీక్ బాధితుల్ని చంద్రబాబు పరామర్శిస్తారు.
ఆ తర్వాత జిల్లా టీడీపీ నేతలతో సమావేశం అవుతారు. తర్వాత ఉండవల్లి బయలుదేరి వెళతారు. కొద్ది రోజుల క్రితం.. చంద్రబాబు.. విశాఖలో వైసీపీ నేతల భూదందాలను బయటపెడతానంటూ.. విశాఖ పర్యటనకు బయలుదేరారు. పోలీసులు పర్మిషన్ కూడా ఇచ్చారు. అయితే.. ఆయన విమాశ్రయంలో దిగేటప్పటికీ.. వైసీపీ కార్యకర్తలందర్నీ.. ఎయిర్‌పోర్టు ప్రాంగణంలోకి అనుమతించి.. వారిని చెదరగొట్టకుండా… చంద్రబాబునే వెనక్కి పంపారు. ఈ వ్యవహారంపై హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చేసింది. విశాఖ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళ్తూండటం ఆసక్తి రేకెత్తిస్తోంది.
చంద్రబాబు ఎప్పుడు వచ్చినా అడ్డుకుంటామని గతంలో వైసీపీ నేతలు ప్రకటించి ఉన్నారు. అప్పట్లో విశాఖ పోలీసులు చంద్రబాబు పర్యటనకు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు నేరుగా డీజీపీనే ఇచ్చారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో గుమికూడటానికి.. ఆందోళనలకు… పర్మిషన్ ఉండదు. చంద్రబాబును అడ్డుకోవాలని అనుకుంటే వైసీపీ నేతలకు.. అలాంటి రూల్స్ వర్తించకపోవచ్చని గత అనుభవాలు చెబుతున్నాయి. అందుకే.. చంద్రబాబు పర్యటన ఆసక్తి రేకెత్తిస్తోంది.