లాక్ డౌన్ నిబంధనల నుంచి చిత్రసీమకు కొన్ని మినహాయింపులు లభించాయి. పరిమితమైన సిబ్బందితో షూటింగులు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. జూన్ మొదటి వారం నుంచి చిత్రీకరణలు జరిగే ఛాన్స్ ఉంది. అయితే షూటింగులు మొదలైనా కొంతమంది హీరోలు సెట్లోకి రావడానికి జంకుతున్నారని వార్తలొస్తున్నాయి. `కరోనా తగ్గేంత వరకూ మేం రాం` అని నిర్మాతలకు మొహం మీదే చెప్పేస్తున్నార్ట. దాంతో షూటింగులు మొదలెట్టొచ్చన్న నిర్మాతల ఆనందంపై నీళ్లు చల్లినట్టైంది.
హీరోలే కాదు, హీరోయిన్లూ ఇప్పుడు షూటింగ్ అంటే గజగజ వణుకుతున్నారు. కరోనా భయంతో షూటింగులు చేయడం కష్టమే అని లావణ్య త్రిపాఠీ తేల్చి చెప్పింది. మరో అగ్ర కథానాయిక అయితే ”నేనప్పుడే షూటింగులకు రాలేను. తప్పదనుకుంటే నా స్థానంలో మరో కథానాయికని తీసుకోండి” అని నిర్మాతలకు ముందే చెప్పేసిందట. అయితే అది సాదాసీదా సినిమా కాదు. స్టార్ హీరో, స్టార్ దర్శకుడు కలిసి చేస్తున్న సినిమా. అలాంటి అవకాశాన్ని కూడా ఆ కథానాయిక వదులుకోవడానికి సిద్ధపడిందంటే, చిత్రసీమలో ఎలాంటి భయాలు ఉన్నాయో అర్థమవుతోంది. హీరోలే భయపడుతున్నారంటే, వాళ్లకు ఇప్పుడు హీరోయిన్లూ తోడవుతున్నారు. ఇలాగైతే షూటింగులు జరిగేదెలా??