జీవితం ఓ సైకిల్ చక్రం లాంటిది. ఎక్కడ మొదలెట్టామో తిరిగి అక్కడికే వచ్చి ఆగుతాం. సినిమాల పరిస్థితి ఇప్పుడు అలానే మారింది. ఇది వరకూ సినిమా అంటే స్టూడియో వ్యవహారమే. తొలి సన్నివేశం నుంచి చివరి వరకూ స్టూడియోల్లోనే లాగించేసేవారు. పెద్ద పెద్ద అట్ట సెట్టింగులు కనిపిస్తూ ఉండేవి. ఆ తరవాత అవుడ్డోర్కి అలవాటు పడ్డారు. అత్యవసరమైతే తప్ప.. అవుడ్డోర్ షూటింగ్‌కి వెళ్లేవారు కాదు. కానీ క్రమంగా అవుడ్డోర్ ప్రధానమైపోయి.. ఇండోర్లు తగ్గించేశారు. పౌరాణిక, చారిత్రక చిత్రాలు తప్ప.. సెట్ వాడకం బాగా తగ్గిపోయింది. గుణ శేఖర్, రాజమౌళి లాంటి దర్శకులు వచ్చాక.. సెట్ రంగానికీ, స్టూడియోలకూ కళ వచ్చింది. ఇప్పుడు ఎంత చిన్న సినిమా అయినా.. అవుడ్డోర్ కోసం, ఫారెన్ పరిగెట్టాల్సిందే. అక్కడ లొకేషన్లు బాగుంటాయి. పైగా ఖర్చు తక్కువ. జనం కూడా సహజత్వానికే పెద్ద పీట వేస్తున్నారు. ఏది సెట్లో, ఏది లైవో చూపులతోనే చెప్పేస్తున్నారు. అందుకే దర్శకులు కూడా లైవ్ లొకేషన్లకు పెద్ద పీట వేస్తున్నారు. దాంతో స్టూడియోలన్నీ.. దాదాపు మూత పడే స్థాయి కి చేరుకున్నాయి. పాటలలో, ఇంటి సెట్ కో తప్ప… ఎవరూ స్టూడియోల వైపు కన్నెత్తి చూడడం లేదు.
కాల చక్రం గిర్రున తిరిగింది. మళ్లీ… ఎక్కడ మొదలెట్టామో… అక్కడికి వచ్చి ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సినిమాలన్నీ స్టూడియోలవైపే చూస్తున్నాయి. అన్నపూర్ణ, ఆర్.ఎఫ్,సీ, రామానాయుడు… ఇలా స్టూడియోలోని ఫ్లోర్లన్నీ ముందే బుక్కయిపోతున్నాయి. కరోనా వల్ల.
అవును.. ఇప్పుడు స్టూడియోలే పెద్ద దిక్కుగా మారబోతున్నాయి. లాక్ డౌన్ లో కొన్ని మినహాయింపులు ఇచ్చి షూటింగులకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. పరిమితమైన సిబ్బంది మధ్య షూటింగ్ జరుపుకోవాలి. అవుడ్డోర్ కంటే, ఇండోర్‌లోనే ఆ సౌలభ్యం ఎక్కువ. ముందు పాటలు, చిన్న చిన్న సన్నివేశాల్ని తెరకెక్కించుకుంటే, ఆ తరవాత పరిస్థితిని బట్టి ఆలోచించుకోవచ్చని దర్శక నిర్మాతలు ఫిక్సయ్యారు. పాటలంటే.. ఇప్పుడు అవుడ్డోర్‌లో తీసే అవకాశం లేదు. కాబట్టి ఇండోర్ తప్ప మరో మార్గం లేదు. దాంతో స్టూడియోలోని ఫ్లోర్లన్నీ బుక్కయిపోయాయి. `ఆర్.ఆర్.ఆర్`, `వకీల్ సాబ్`, `ఆచార్య`, ప్రభాస్ సినిమా… ఇవన్నీ ఇప్పుడు సెట్స్‌లోనే జరగబోతున్నాయి. క్రిష్- పవన్ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద సెట్ వేయబోతున్నారు. దాదాపు 40 శాతం ఆ సెట్లోనే షూటింగ్ జరగబోతోంది. కొన్నాళ్లు ఇండోర్ షూటింగులు ఉండకపోవొచ్చు. ఫారెన్ వెళ్లే ఛాన్సే లేదు. కథ ప్రకారం విదేశాలకు సంబంధించిన సన్నివేశాలుంటే వాటిని బ్లూ మేట్ లో తీయాలి. అలా చేయాలన్నా.. సెట్సే ఆధారం. సో..
మళ్లీ స్టూడియోలకు జీవం వచ్చినట్టైంది. కేవలం టీవీ షోలకే పరిమితమైపోయిన సారధి స్టూడియోలు సైతం ఇప్పుడు కొత్త ఉత్సాహం తెచ్చుకుంటున్నాయి. భవిష్యత్తులో ఇంకెన్ని మార్పులు చూస్తామో..?