ఒక్క హత్య చేశాడు.. అది ఎక్కడ బయటపడుతుందోనని తొమ్మిది మందిని చంపేశాడు. స్థూలంగా వరంగల్ జిల్లాలోని గొర్రెల కుంట బావిలో బయటపడిన తొమ్మిది మృతదేహాల కథ. ఇందులో నిందితుడు..బాధితులు.. ఎవరూ తెలుగువాళ్లు కాదు. ఉత్తరాది వాళ్లు. వలస కూలీలు కావడంతో… లాక్ డౌన్ టైంలో వారు కనిపించకపోయినా ఎవరూ పట్టించుకోలేదు. నడుచుకుంటూ వెళ్లిపోయారేమో అనుకున్నారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. బీహార్‌కు చెందిన సంజయ్ కుమార్ ఒక హత్య నుంచి తప్పించుకోవడానికి 9 హత్యలు చేశాడు. బీహార్‌కు చెందిన మక్సూద్, అతని భార్య వరంగల్ లోని గోనె సంచుల గోడౌన్లో పనిచేస్తున్నారు. 4 ఏళ్ల క్రితం బిహార్‌కు చెందిన సంజయ్‌కుమార్ కూడా అక్కడే పనికి చేరాడు. దాంతో మక్సూద్ కుటుంబానికి పరిచయం ఏర్పడింది.
మక్సూద్ భార్య చెల్లెలు రఫికా భర్తతో విడిపోయింది. ఆమెతో సంజయ్ సహజీవనం చేశాడు. రఫికా కుమార్తెతోనూ సంజయ్ సన్నిహితంగా ఉండేవాడు.. తనను పెళ్లి చేసుకుంటానని కూతురితో సన్నిహితంగా ఉంటున్నావని.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సంజయ్‌ని రఫికా బెదిరించింది. దాంతో రఫికాను అడ్డుతొలగించుకోవాలని సంజయ్ భావించి.. బెంగాల్ వెళదామని రైల్లో తీసుకెళ్లి హత్య చేశాడు. రైల్లో మజ్జిగ ప్యాకెట్లో నిద్రమాత్రలు కలిపి రఫికాకు ఇచ్చాడు.. తర్వాత ఆమెను రైల్లోంచి కిందకు తోసేసి.. తిరిగి వరంగల్ వచ్చేశాడు. రఫికా ఏమైందని సంజయ్‌ని మక్సూద్ భార్య ప్రశ్నించి.. పోలీసులకు చెబుతానని బెదిరించింది. దాంతో దొరికిపోతానని భావించి మక్సూద్ అలం, భార్య నిషాను చంపాలని ప్లాన్ వేసుకున్నాయి.
పెద్ద ఎత్తున నిద్రమాత్రలు కొని.. మక్సూద్ కుమారుడి బర్త్‌డే రోజు..భోజనంలో కలిపాడు . ఆ భోజనాన్ని మక్సూద్ కుటుంబంలోని ఆరుగురితో పాటు.. గోడౌన్లో పనిచేస్తున్న మరో ముగ్గురు కూడా తిన్నారు. వారందరూ స్పృహతప్పి పడిపోవడంతో తీసుకెళ్లి బావిలో వేసి..సైలెంట్‌గా ఉండిపోయారు. వారంతా బావిలో పడి ఊపిరాడక చనిపోయారు. మొదట ఆత్మహత్యలుగా భావించిన పోలీసులు.. తర్వాత అనుమానంతో విచారణ చేయడంతో.. గుట్టు అంతా రట్టయిపోయింది.