ఆంధ్రప్రదేశ్లోముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు ఏడాది అవుతోంది. ఈ ఏడాదిలో ఆయన పరిపాలనా సంస్కరణలతో పాటు.. ప్రజల స్థితిగతుల్ని మార్చగలికే.. విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. విప్లవాత్మక మార్పుల ద్వారా.. వాటిని శాశ్వతంగా అభివృద్ధి చేయాడనికి సంకల్పించారు. ప్రజలు ఆర్థికంగా ఎదుగాలంటే.. విజ్ఞానపరంగా ఎదగాలి..! ఆరోగ్య పరంగా బాగుండాలి..! ఈ రెండింటిని రాత్రికి రాత్రి సాధించలేరు. ఆయా రంగాల్లో ప్రభుత్వ సేవలు ఎంత బలంగా ఉంటే.. ఆ సేవలు అంత నిర్మాణాత్మకంగా ప్రజలకు అందుతాయి. అందుకే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రెండింటిపై ప్రత్యేక శ్రద్ధపెట్టి.. ” నాడు -నేడు” అనే కార్యక్రమంతో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నారు.
గ్రామ స్థాయి వరకూ వైద్య సౌకర్యాల కోసం రూ. 16వేల కోట్లు…!
ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత. వైద్య రంగంపై ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. కానీ సొంతంగా మౌలిక సదుపాయాలు మాత్రం పెరగడంలేదు. దీని వల్ల ప్రైవేటు ఆస్పత్రులపై ఆధారపడేవారి సంఖ్య పెరిగిపోయింది. అక్కడా ఆరోగ్య శ్రీ పేరుతో ఉచిత వైద్యం అందిస్తున్నారు కానీ.. అది.. కేవలం.. కార్పొరేట్ ఆస్పత్రులకు లాభం కలిగించేలా మాత్రమే ఉంటోంది. ఈ అంశాలను అధ్యయనం చేసిన ముఖ్యమంత్రి జగన్… “నాడు-నేడు” కింద వైద్య సౌకర్యాల మెరుగుపర్చాలని ఆలోచన చేశారు. నాడు-నేడు కార్యక్రమం కింద విలేజ్ క్లీనిక్కులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తారు. వైద్య రంగంలో అభివృద్ధి పనులు, కొత్త నిర్మాణాల కోసం ఈ కార్యక్రమం కింద దాదాపు రూ.16,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. వైద్యాన్ని గ్రామీణ స్థాయికు తీసుకెళ్లి.. ప్రజలకు ఎంత చిన్న అనారోగ్యం వచ్చినా తక్షణం వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇప్పటికే టెలీమెడిసిన్ సేవల్ని ప్రారంభించారు. ఆ సేవలు పొందిన వారికి ఉచితంగా మందులు ఇచ్చే ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం బైకుల్ని కొనాలని ఆదేశించారు. ఈ పనులన్నింటినీ ఏడాదిలో పూర్తి చేసి.. వైద్య రంగంలోనే సమూలమైన మార్పులు తేవాలని.. వాటి ద్వారా దీర్ఘకాలిక లాభాలను ప్రజలకు అందించాలని జగన్ ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వ విద్యపై నమ్మకం కలిగించేలా కొత్త కార్యాచరణ..!
ఇక భావి పౌరులందరూ.. ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుకునేలా ప్రోత్సహించడానికి ప్రభుత్వం నాడు – నేడు కార్యక్రమాన్ని అమలు చేయడం ప్రారంభించారు. ప్రభుత్వం ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. నాడు-నేడు పథకంలో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తొలి విడతలో రూ 3,600 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ సదుపాయం, అసంపూర్తి నిర్మాణాలకు నిధుల విడుదల, ఫర్నిచర్, తదితర అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. రాష్ట్రంలోని దాదాపు 45వేల స్కూళ్లను నాడు నేడు కింద బాగుచేస్తున్నారు. తర్వాత దశలో జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐలు, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లను ఈ పథకంలో భాగంగా బాగు చేస్తారు. ప్రతి స్కూల్లో చేపట్టాల్సిన పనులపై చెక్ లిస్టు ఉంంటుంది. నవంబర్ 14వ తేదీ కల్లా.. స్కూళ్లలో అన్ని పనులు పూర్తి చేయాలని… వాటిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తున్నారు. స్కూలు ప్రారంభం కాగానే పిల్లలకు యూనిఫారమ్స్, బూట్లు, పుస్తకాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.
విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు ప్రజల అభివృద్ధికి బాటలు..!
విద్య, వైద్య రంగాలు అభివృద్ధి చెందితే సహజంగానే ప్రజల అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం, విజ్ఞానం ప్రజలకు ఉచితంగా అందించగలిగితే.. అది వారి అభివృద్ధికి బాటలు వేస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలన్నీ.. విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వాధిపత్యాన్ని మాత్రమే అంగీకరిస్తాయి. ఆ సేవల్ని ప్రజలకు తాము ఉచితంగా అందించడానికే ప్రయారిటీ ఇస్తాయి. కానీ.. మన దేశంలో మొత్తం కార్పొరేటీకరణ అయిపోయింది. ఈ పరిస్థితుల్ని మార్చడానికి ముఖ్యమంత్రి జగన్ నడుంకట్టారు. ఆయన ప్రయత్నాలు సఫలమైతే.. ఏపీ విద్య, వైద్య రంగంలో సమూల మార్పులు కనిపించే అవకాశం ఉంది.