నగరి ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువైపోతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై రోజా ఫైరయ్యారు. నారాయణస్వామి పుత్తూరులో పర్యటించారు. కానీ రోజాకు సమాచారం అందలేదు. పుత్తూరు .. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న నగరి నియోజకవర్గం కిందకు వస్తుంది. తన నియోజకవర్గానికి తనకు సమాచారం లేకుండా డిప్యూటీ సీఎం రావడం ఏమిటని.. ఆమె ప్రశ్నించడం ప్రారంభించారు. మీడియాను పిలిచి చెప్పకుండా.. మీడియా ప్రతినిధులకు ఫోన్లు చేసి.. ఈ అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజా అసంతృప్తి గురించి తెలుసుకున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. తన వివరణను కూడా మీడియా ప్రతినిధులకే చెప్పారు. దళిత సంఘాల వినతి మేరకు.. కళ్యాణమండపం కోసం స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లానని అందులో రాజకీయం ఏమీ లేదని చెప్పుకొచ్చారు.
లాక్ డౌన్ కారణంగా చాలా రోజులుగా.. రోజా నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. అయితే.. ఆమెకు.. సొంత పార్టీలో గ్రూపు గొడవలు ఇబ్బంది పెడుతున్నాయి. మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో సన్నిహితంగా ఉంటున్న నేతలు.. రోజాకు చెక్ పెడుతున్నారని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం..రోజా పూలు చల్లించుకున్న వీడియో వైరల్ కావడానికి కూడా.. వైసీపీలోని గ్రూపుతగాదాలే కారణం అని చెబుతున్నారు. సీనియర్ అయిన రోజా.. మంత్రి పదవికి పోటీలో ఉన్నారు. రెండున్నరేళ్ల తర్వాత పదవి ఖాయమని ఆమె నమ్ముతున్నారు. ఇప్పటికే ఏడాది పూర్తయిపోయింది. అయితే.. సామాజికవర్గ సమీకరణాల ప్రకారం చూసుకుంటే… ఆమెకు పదవి ఇస్తే.. చిత్తూరు నుంచి మరో ప్రధాన సామాజికవర్గానికి చెందిన వారికి ఉద్వాసన పలకాల్సి ఉంటుంది.
ఇలాంటి ఈక్వేషన్స్‌తో రోజాకు ఇటీవలి కాలంలో… ఇబ్బందులు పెరిగిపోయాయని అంటున్నారు. వాటిని రోజా.. తనదైన పద్దతిలో తట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ.. పెద్దగా వర్కవుట్ అవుతున్నట్లుగా లేదు. సొంత పార్టీ నేతలపైనే ఆమె ఫైరవుతూండటాన్ని అగ్రనాయకత్వం మైనస్‌గా చూసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీన్ని రోజా గుర్తించలేకపోతున్నారంటున్నారు.