స్వతహాగా రచయితలైన దర్శకులు రీమేక్‌లను అంతగా ప్రోత్సహించరు. కారణం.. వాళ్ల దగ్గరే బోలెడన్ని కథలుంటాయి. త్రివిక్రమ్ ఇప్పటి వరకూ రీమేక్ జోలికి వెళ్లలేదు. హాలీవుడ్ కథల్ని, నవలల్ని, పాత సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకుని కొత్త కథలు అల్లుకుని తనదైన టచ్ ఇచ్చాడు గానీ, రీమేకులు చేయలేదు. కాకపోతే అలాంటి ప్రయత్నాలు సాగాయి. అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురంలో’ సినిమా చర్చల్లో ఉన్నప్పుడ ఓ బాలీవుడ్ సినిమాని త్రివిక్రమ్ రీమేక్ చేస్తారని వార్తలొచ్చాయి. వాటిని ఆ తరవాత త్రివిక్రమ్ ఖండించారు కూడా. చెప్పినట్టే ఆయన రీమేక్ జోలికి వెళ్లలేదు. మరో పాత కథని (ఇంటిగుట్టు)ని తీసుకుని కొత్తగా కథ చెప్పారు. ఆప్రయత్నం జనాలకు బాగా నచ్చడంతో – ఆ సినిమాని బ్లాక్ బ్లస్టర్ చేశారు.
ఇప్పుడు త్రివిక్రమ్ పై మరో గాసిప్ చక్కర్లు కొడుతోంది. వెంకటేష్ – నానిలతో త్రివిక్రమ్ సినిమా చేస్తాడని ఓ వార్త బాగా షికారు చేస్తోంది. అది ఓ రీమేక్ అని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘అల వైకుంఠపురములో’ సమయంలో త్రివిక్రమ్ రీమేక్ చేస్తాడన్న `సోను కి టీటీ కి స్వీటీ` సినిమాని ఇప్పుడు త్రివిక్రమ్ తెలుగులో చేయబోతున్నాడని ఓ టాక్. మరోవైపు మలయాళ చిత్రం ‘అయ్యప్పయుమ్ కోషియమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తారని గత కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్‌కి అత్యంత సన్నిహితమైన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని సాధించడంతో.. ఆ సినిమాని త్రివిక్రమ్ రీమేక్ చేస్తాడన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే త్రివిక్రమ్ రీమేక్ లపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. తన దగ్గరే బోలెడన్ని కథలున్నాయని, ఒక వేళ రీమేక్ చేయాలనుకున్నా… కేవలం ఆ పాయింట్ మాత్రమే తీసుకునే ఛాన్సుంది. ”త్రివిక్రమ్ రీమేక్ చేసే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఆయన దగ్గరే చాలా కథలున్నాయి. ఒక వేళ వెంకీ – నాని సినిమా ఓకే అయినా అది రీమేక్ కాకపోవొచ్చు” అని త్రివిక్రమ్ సన్నిహితులు చెబుతున్నారు.