చిత్రసీమ యావత్తూ ‘క్లాప్’ కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మళ్లీ సెట్లు కళకళలాడే రోజు కోసం కలలు కంటోంది. జూన్‌లో చిత్రీకరణలు మొదలవుతాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి లోబడి చిత్రీకరణలు జరుపుకోవాల్సి వుంటుంది. అయితే ఈలోగా… టాలీవుడ్ కూడా ఓ గైడ్ లైన్స్ రూపొందించుకుంది. తమ ప్రతిపాదనల్ని, షూటింగ్ చేసుకునే పద్ధతుల్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలనూ నివేదించబోతోంది. ఈరోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో దర్శక నిర్మాతల కీలక భేటీ సాగింది. రాజమౌళి, బోయపాటి శ్రీను, కొరటాల శివ, డివివి దానయ్య, అశ్వనీదత్, దిల్ రాజు లాంటి ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
లాక్ డౌన్ నిబంధలకు లోబడే షూటింగులు ఎలా జరుపుకుంటామో తెలుపుతూ.. ఓ డెమో వీడియోని రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు. ఆ వీడియో ఎలా ఉండాలి అనే విషయాలతో పాటు, ముఖ్యమంత్రుల దృష్టి కి ఎలాంటి విషయాలు తీసుకెళ్లాలి? చిత్రసీమ మేలు కోసం ఎలాంటి కమిట్మెంట్స్ తీసుకోవాలనే విషయంలో తర్జన భర్జనలు జరిగాయి. ఇప్పటికే కేసీఆర్ తో చిత్రసీమ ఓ సారి భేటీ అయ్యింది. ఇప్పుడు మరో దఫా కేసీఆర్‌ని కలవబోతోంది. దాంతో పాటు.. జగన్‌తోనూ సమావేశం అవ్వబోతోంది చిత్రసీమ. అందుకు సంబంధించిన అపాయింట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో కేసీఆర్‌తో ఓ సమావేశం జరగబోతోంది. జగన్‌తో వీడియో కాన్ఫిరెన్స్‌లో మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రుల కూడా చిత్రసీమ విషయంలో సానుకూలంగా స్పందింస్తారని దర్శక నిర్మాతలంతా ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ గైడ్ లైన్స్ విషయంలో ముఖ్యమంత్రుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.