సాంకేతికత ఉపయోగించుకోవడంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు ముందు ఉంటారు. కరోనా కాలంలోనూ ఆయన ఈ సాంకేతిక ఆధారంగానే పనులు చక్క బెడుతున్నారు. జూమ్ యాప్ను గరిష్టంగా ఉపయోగించుకుంటున్నారు. మహానాడును కూడా డిజిటల్ మయం చేశారు. అనుకోని విధంగా.. మహానాడు జరిపే పరిస్థితి లేకపోవడంతో.. వాయిదా వేయడం కన్నా… వర్చవల్లో పని పూర్తి చేస్తే బాగుంటుందనే అంచనాకు వచ్చారు. ఏర్పాట్లు పూర్తి చేశారు. జూమ్యాప్ ద్వారా 14 వేల మంది పాల్గొనేందుకు వీలుగా 25 వేల మంది చూసేలా మహానాడు జరగబోతోంది. కరోనా కారణంగా ఈసారి ఈ మహానాడును రెండ్రోజులకే కుదించారు.
రెండ్రోజులపాటు జరగనున్న ఈ మహానాడులో మొత్తం 13 తీర్మానాలపై మహానాడులో చర్చించేందుకు ఎజెండా సిద్ధం చేశారు. మొత్తం 52 మంది ఈ వెబ్నార్ మహానాడులో ప్రసంగించనునున్నారు. ప్రతీ సారి మహానాడు 15 వేల మందితో అట్టహాసంగా నిర్వహించేవారు. తీర్మానాలు పెట్టేవారు, తీర్మానాలు బలపరిచేవారు జిల్లాల నుంచే సాంకేతికత ఆధారంగా ఈ మహానాడులో పాల్గొని తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. దేశంలోనే తొలిసారిగా ఏ రాజకీయ పార్టీ పెట్టని విధంగా టీడీపీ వర్చువల్ మహానాడు నిర్వహించి అందరూ ఇదే పంధాను కొనసాగించే కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు.
మహానాడు సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలందరికీ వెబ్ నార్ లో పాల్గొనేందుకు అవసరమైన పాస్ వర్డ్ లన్నింటినీ పంపారు. మూడ్రోజుల నుంచి మహానాడు నిర్వహణకు సంబంధించిన ట్రయల్ రన్ ను సైతం నిర్వహించారు. సాంకేతికతను ఉపయోగిస్తుండటంతో నిర్వహించిన ట్రయల్ రన్ లో పూర్తిస్థాయిలో పనిచేసిందని పార్టీ నేతలు చెప్పారు. పార్టీ తీర్మానాలకు సంబంధించి ఇప్పటికే కమిటీ చర్చించి ఖరారు చేసింది.