మల్టీస్టారర్ అనగానే.. ఇది వరకు హీరోలు భయపడిపోయేవారు.
కథ కుదరదండీ..
ఇమేజ్‌లు అడ్డొస్తాయి..
బడ్జెట్లు సరిపోవు…
– ఇలా రకరకాల కారణాలు చెప్పేవారు. కథలు ఉన్నా, వాటిని చేయడానికి హీరోలు ధైర్యం చూపించేవారు. ఈగో గోడలు అడ్డొచ్చేవి. అయితే వాటన్నింటినీ పటాపంచలు చేసినవాడు విక్టరీ వెంకటేష్.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో కొత్త సంప్రదాయం మొదలైంది. హీరోలిద్దరూ తెర పంచుకొనే ధైర్యం వచ్చింది. ఆ తరవాత మల్టీస్టారర్లు విరివిగా రావడం మొదలెట్టాయి. చాలా వాటిలో… వెంకీనే హీరో. ఇప్పుడు కూడా మల్టీస్టారర్ అంటే వెంకటేష్ గుర్తొస్తాడు. అంతలా ప్రభావం చూపించాడు వెంకీ. మసాలా, గోపాల గోపాల, వెంకీ మామా, ఎఫ్ 3… ఇలా మల్టీస్టారర్‌కి కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. ఇప్పుడు కూడా వెంకీ చేతిలో మూడు మల్టీస్టారర్ ప్రాజెక్టులు ఉన్నాయి.
ఎఫ్ 2కి సీక్వెల్‌గా ఎఫ్ 3 కథని సిద్ధం చేశాడు అనిల్ రావిపూడి. వెంకీ లేకుండా ఎఫ్ 3 ఎలా ఉంటుంది? సో.. మరోసారి వెంకీ, వరుణ్‌లు కోబ్రా సెంటిమెంట్ కొనసాగించబోతున్నారు. టాలీవుడ్లో ఇప్పుడు రెండు క్రేజీ మల్టీస్టారర్ల గురించి విస్త్రృతంగా ప్రచారం సాగుతోంది. వెంకీ – నాని కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడని కూడా అంటున్నారు. మరోవైపు వెంకీ – సాయిధరమ్ తేజ్ కలిసి ఓసినిమా చేస్తారని వార్త గట్టిగా వినిపిస్తోంది. త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. అలా… ఈ సీజన్ లో ప్రచారంలో ఉన్న మూడు మల్టీస్టారర్లలోనూ వెంకీనే హీరో. అలా మొత్తానికి తెలుగులో మల్టీస్టారర్ కాన్సెప్ట్‌కి పెద్ద దిక్కయిపోయాడు వెంకీ. మరి ఆయన ఖాతాలో ఇంకెన్ని మల్టీస్టారర్లు వచ్చి చేరతాయో చూడాలి.