తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎర్రబెల్లి దయాకర్‌రావు సీనియారిటీకి అవమానం ఏమీ లేకుండా ఆయనను చాలా గౌరవప్రదంగానే చూసుకున్నది. ఆయనను శాసనసభ ఫ్లోర్‌లీడర్‌ను చేసింది. చాలా సందర్భాల్లో ఆయన తెరాస పార్టీ పట్ల కులాభిమానంతో మెతగ్గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా.. తెదేపా సగౌరవంగానే చూసింది. అయితే ఆయన తాజాగా తెరాసలోకి ఫిరాయించిన నేపథ్యంలో శాసనసభలో ఫ్లోర్‌లీడర్‌గా ఖాళీ అయిన స్థానాన్ని రేవంత్‌రెడ్డికి అప్పగిస్తూ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు.
అసెంబ్లీ ఫ్లోర్లో ప్రభుత్వాన్ని నిలదీయడం అనేది, ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలను ఎత్తిచూపించడం అనేది ఇవాళ్టి రాజకీయాల్లో చాలా కీలకం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు తెలంగాణ అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి ఉన్న సమయంలో అధికార పార్టీ మీద విరుచుకుపడడం చాలా దూకుడుగా ఉంటుందని, ఎర్రబెల్లి సభలో ఉంటే అంతా నీరుగారిపోతారనే అపప్రధ కూడా గతంలో ఉండేది. ఆ విషయాలను సింక్ చేసుకుని, అప్పటినుంచి ఆయన తెరాసకు కోవర్టుగా పనిచేశారా లేదా అనే పుకార్లు ఇప్పుడు పుడుతున్నాయి గానీ.. మొత్తానికి ఆయన పోకతో.. తెరాస సర్కారు వైఫల్యాలను సభాముఖంగా ఎత్తిచూపించడంలో తెదేపా కు ఉన్న బలం చాలా తక్కువే అయినా.. మొహమాటం లేని పరిస్థితి ఏర్పడింది.
ఎర్రబెల్లి పార్టీ మారిన నేపథ్యంలో.. ఆయన చాన్నాళ్లుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయనను పార్టీనుంచి సస్పెండ్ చేశాం అని… కనుక ఆయన స్థానంలో రేవంత్‌రెడ్డిని పార్టీ ఫ్లోర్‌లీడర్‌గా గుర్తించాలని కోరుతూ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ఒక లేఖ రాశారు. తెదేపాకు ఇప్పుడు అయిదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వీరిలో నికరంగా తెరాసమీద పోరాడే తెగువతో ఉన్న వారి సంఖ్య ఇంకా తక్కువే కావొచ్చు. కానీ.. ఈ పరిమితమైన సంఖ్యాబలంతో రేవంత్ సభలో పోరాటాన్ని ఎలా నడిపిస్తారో చూడాలి.