వైకాపా ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ ఈరోజు ఉదయం ఒక టీవీ ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ- హైకోర్టు పై విమర్శలు చేసిన తమ పార్టీ నేతలు, అభిమానులు చాలా వరకు నిరక్షరాస్యులే అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయనకు ఈ రోజంతా తలనొప్పులు తెచ్చిపెట్టాయి. సొంత పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియాలో ఆయన ను ఒక రేంజ్ లో ఆడుకున్నారు. వివరాల్లోకి వెళితే..
https://www.telugu360.com/te/ysrcp-leaders-to-criticized-courts-are-ignorants/
ఇటీవల జగన్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను హైకోర్టు తప్పుపడుతూ తీర్పు వెలువరించడం ఆ పార్టీ అభిమానులకు రుచించలేదు. దీంతో ఏకంగా హైకోర్టు న్యాయమూర్తుల కే రాజకీయ కారణాలను ఆపాదిస్తూ సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థపై దుర్భాషలాడారు ఆ పార్టీ అభిమానులు. అయితే ఇలా దుర్భాషలాడిన వారిలో వైఎస్ఆర్ సీపీకి చెందిన ఒక ఎంపీ తో పాటు మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. హైకోర్టు దీనిని తీవ్రంగా పరిగణించి సుమోటోగా కేసు స్వీకరించడం వైఎస్ఆర్ సిపి నేతల లో అభిమానుల్లో కలవరం కలిగించింది. అద్దేపల్లి శ్రీధర్ దీనిపై టీవీ డిబేట్ లో స్పందిస్తూ, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిలో చాలామంది ఇల్లిటరేట్స్ అని వ్యాఖ్యానించారు.
అయితే తమను నిరక్షరాస్యులుగా అద్దేపల్లి శ్రీధర్ అభివర్ణించడం వైఎస్ఆర్సిపి కార్యకర్తల లో చాలామందికి మింగుడు పడలేదు. తమను, తమ పార్టీ నేతలను నిరక్షరాస్యులుగా చిత్రీకరించే హక్కు నీకెక్కడిది అంటూ ఆయన పై సోషల్ మీడియాలో వైఎస్ఆర్సిపి అభిమానులు విరుచుకుపడ్డారు. అద్దేపల్లి శ్రీధర్ ఎవరికో అద్దె మైక్ లాగా వ్యవహరిస్తున్నాడు అంటూ ఆయనపై కొందరు విమర్శలు కూడా చేశారు. ఆయన కూడా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ , వారిలో చాలామందికి అంతే స్థాయిలో ఘాటుగా సమాధానమిచ్చారు. మరి కొందరు జనసేన అభిమానులు అయితే ఆయన జనసేన లో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఆయన మీద ఈగ వాలనీయకుండా జనసేన అభిమానులు చూసుకునే వారని ఇప్పుడు పార్టీ ఫిరాయించి వైఎస్సార్సీపీ లోకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీ అభిమానులే ఆయనను తిడుతున్నారు అని గుర్తు చేశారు.
అయితే సోషల్ మీడియాలో పలువురికి అద్దేపల్లి శ్రీధర్ సమాధానం ఇచ్చినప్పటికీ, తమ పార్టీ అభిమానుల నుండి ఈ తరహా స్పందన వస్తుందని ఆయన ఊహించలేకపోయినట్లు గా కనిపిస్తోంది. తమ సొంత పార్టీ అభిమానులకు వివరణ మీద వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది.