ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏడాది పూర్తి కావొస్తోంది. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వం… రాజ్యాంగాన్ని గౌరవిస్తూ.. పాలన సాగిస్తోందా అనే అనుమానాలు ఒక్క ఏడాదిలోనే అందరిలోనూ ప్రారంభమయ్యాయి. ఎందుకంటే… ఏడాదిలో అరవైకిపైగా సార్లు ప్రభుత్వాన్ని హైకోర్టు చీవాట్లు పెట్టింది. జీవోలు రద్దు చేసింది. అనేక నిర్ణయాలను ప్రశ్నించింది. కానీ.. ఏపీ సర్కార్ అన్నీ దులిపేసుకుని తాము చేయాలనుకున్నది చేస్తోంది. చివరికి ఇప్పుడు అధికార పార్టీ మద్దతుదారులు…న్యాయవ్యవస్థ విశ్వసనీయతనూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విపరీత పరిణామాలు ఒక్క ఏడాదిలోనే చోటు చేసుకున్నాయి.
ఏడాది మొత్తం చట్ట, రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలే..!
ఏడాది పాలన అంటే 365 రోజుల పాలనలో దాదాపు 63 సార్లు మెట్టికాయలు, అక్షింతలు వేయించుకుంది ఏపీ ప్రభుత్వం. ఇలాంటి చట్ట వ్యతిరేక పాలన చేసిన ప్రభుత్వం దేశంలోనే ఇంకోకటి లేదంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు… ఒకటి, రెండు సార్లు తప్పు పట్టి రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని చెబితేనే…గతంలో సంబంధిత మంత్రులు తప్పు చేసినట్లు ఫీలయి రాజీనామా చేసేవాళ్లు. ఇప్పుడు హైకోర్టు నేరుగా రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయం అని.. తేల్చి చెప్పినా…ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదు. ఒక సారి కాదు..రెండు సార్లు ఏడాదిలో అరవై సార్లకుపైగా ప్రభుత్వ నిర్ణయాలను హైకోర్టు తప్పు పట్టింది. కానీ ప్రభుత్వం ఆ నిర్ణయాలను ఏదోరూపంలో అమలు చేసే ప్రయత్నం చేస్తోంది కానీ.. హైకోర్టు తీర్పులను పట్టించుకోవడం లేదు. దేశంలో ఓటు హక్కే నిర్బంధం కాదు.. కానీ ఇంగ్లిష్ మీడియాన్ని నిర్బంధం చేయాలనుకుంది ఏపీ సర్కార్. అందరూ ఇంగ్లిష్ మీడియమే కోరుకుంటే.. అదే మీడియంలో చేరుతారు.. దానికి చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. మౌలిక సదుపాయాలు కల్పిస్తే చాలు. కానీ ఏపీ సర్కార్ అంతలా ఆలోచించడం లేదు. ఇంగ్లిష్ మీడియం కేస్ స్టడీ మాత్రమే.. రాజధాని తరలింపు దగ్గర్నుంచి రంగుల వరకూ అన్ని వ్యవహారాల్లోనూ ప్రభుత్వ తీరు అలాగే ఉంది.
తప్పు చేశారని చెబితే… న్యాయవ్యవస్థనూ బెదిరించేస్తారా..?
రాజ్యాంగంలో అన్ని వ్యవస్థలకూ ఎవరి అధికారాలు వారికి నిర్వచించారు రాజ్యాంగ నిర్మాతలు. ప్రజలు ఎన్నుకున్నంత మాత్రాన ప్రభుత్వం.. ప్రభుత్వాధినేత… సుప్రీం అయిపోరు. రాజ్యాంగం ప్రకారమే వారు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారమే వారికి అధికారాలు దఖలు పడతాయి. వారు తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధమైతే..సమీక్షించడానికి న్యాయవ్యవస్థ ఉంటుంది. కానీ.. ఏపీలో మాత్రం… ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏం చేసినా సరే..రాజ్యాంగ వ్యవస్థలు ఏవీ ప్రశ్నించకూడదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అంతే కాదు.. ఆయా నిర్ణయాలను పాటించడానికి ఏ మాత్రం.. అంగీకరించడం లేదు. దాంతో ఏపీలో రకమైన రాజ్యాంగఉల్లంఘన వాతావరణం ఏపీలో కనిపిస్తోంది. రాష్ట్రంలో పాలకులు… రాజకీయ, పరిపాలన, న్యాయ వ్యవస్థలను అవగాహన చేసుకుంటే ఏడాది కాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ధర్మాసనంలో వచ్చే తీర్పులు అర్థమవుతాయి. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు ఇవ్వడం ఇదే మొదటి సారి కాదు.
ఉద్దేశాలు ఆపాదించినంత మాత్రాన న్యాయవ్యవస్థ లొంగిపోతుందా..?
పరిపాలన ఎప్పుడూ… వ్యక్తిగత విషయం కాదు. అది ప్రజలకు సంబంధించిన విషయం. పాలకులకు ఎప్పుడూ.. ఈగో ఉండకూడదు. తనను ప్రశ్నించేవారు ఎవరూ ఉండకూడదనే పట్టుదల ఉండకూడదు. తాను తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించినా … తప్పు పట్టినా.. ఆ నిర్ణయం.. రాజ్యాంగ విరుద్ధమైనా సరే అమలు చేయాలనే పట్టింపునకు అసలు పోకూడదు. దేశంలో ఏ రాజకీయ పార్టీ.. ఏ ప్రభుత్వం కూడా… న్యాయవ్యవస్థను ప్రశ్నించే దుస్సాహసానికి దిగలేదు. స్వతంత్ర భారతావని న్యాయవ్యవస్థ ప్రతిష్టను అన్ని వర్గాలు కాపాడుతూనే వస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం.. మొదటి సారి.. ఓ దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. చట్ట ప్రకారం.. రాజ్యాంగం ప్రకారం..తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా.. న్యాయస్థానాలు ప్రశ్నించకూడదన్న రీతిలో ఇలా విమర్శలు చేయడం ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్దేశాలు ఆపాదించి ప్రచారం చేస్తూ.. ఓ రకంగా న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నారని అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. చట్టబద్ధంగా … రాజ్యాంగబద్ధంగా అవగాహన పెంచుకుని పాలన సాగించకపోతే… ముందు ముందు ప్రభుత్వానికి మరింత గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇవి.. ప్రభుత్వ పెద్దలకు మాత్రమే కాదు.. ప్రజలకు చిక్కులు తెచ్చి పెడతాయి.