నిర్మాత అంటే ఈ రోజుల్లో క్యాషియర్ కంటే హీనం అయిపోయాడు. నిర్మాత అనే వాడు సెట్లో ఉండడానికి వీల్లేదు అంటూ హీరోలు హుకూంలు జారీ చేసే రోజుల్లోకి వచ్చేశామంటే పరిస్థితి అర్థం చేసుకోవొచ్చు. కొంతమంది నిర్మాతలకు దర్శకులు కథ కూడా చెప్పరు. హీరోలు విలువే ఇవ్వరు. అయితే.. ఆ కాలంలో ఇలా లేదు. నిర్మాతే అన్నీ! సినిమాని ధనం, మూలం, సర్వం అన్నీ నిర్మాతే. హీరోలు సైతం వాళ్లకు ఇచ్చే విలువ ఆ రేంజులో ఉండేది.
వైజయంతీ మూవీస్ ప్రయాణం, ప్రస్థానం, సాధించిన విజయాలు.. వీటిలో ఎన్టీఆర్ పాత్ర ఎంతో కీలకం. వైజయంతీ మూవీస్‌కి నామకరణం చేసింది కూడా ఆ పెద్దాయనే. ఎన్టీఆర్‌తో `ఎదురు లేని మనిషి` తీస్తున్నప్పుడు అశ్వనీదత్ వయసు 24 ఏళ్లు మాత్రమే. కానీ ఓ రోజు అశ్వనీదత్ సెట్ కి వెళ్తే.. కుర్చీలో కూర్చున్న ఎన్టీఆర్ అమాంతం లేచి, అశ్వనీదత్‌ని ఆహ్వానించారు. ఆ పరిణామానికి అశ్వనీదత్ షాక్‌కి గురయ్యారు. ”అదేంటి సార్… నన్ను చూసి మీరు లేచి రావడం” అంటూ ఆశ్చర్యపోతే… ”ఈ సినిమాకి నిర్మాత మీరు, అందరికీ అన్నం పెట్టేది మీరు. మీ వల్లే మాకు పని దొరికింది. అలాంటి మీకు గౌరవం ఇవ్వాల్సిందే. సెట్లో నేనే మిమ్మల్ని పట్టించుకోకపోతే.. ఎవరు పట్టించుకుంటారు” అంటూ ఎదరు ప్రశ్నించారు ఎన్టీఆర్. అదీ.. నిర్మాతల పట్ల ఆయనకున్న గౌరవ భావం.
ఈ విషయాన్ని ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వైజయంతీ మూవీస్ తన ట్విట్టర్లో గుర్తు చేసుకుంది.