ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఇవాళ ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ఇటీవలి సినీ పరిశ్రమ తెలంగాణ ప్రభుత్వ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన వ్యాఖ్యలు చేసిన కాసేపట్లోనే బాలకృష్ణ తో పరమవీరచక్ర, రూలర్ వంటి చిత్రాలు నిర్మించిన నిర్మాత సి.కళ్యాణ్ బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించడం ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే..
కరోనా వైరస్, లాక్ డౌన్ తదితర పరిణామాల కారణంగా అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమ కూడా కుదేలు అయిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ తదుపరి కార్యాచరణ కోసం చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్దలు పలు దఫాలుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో భేటీ కావడం, ఆ తర్వాత తలసాని చొరవతో పరిశ్రమ పెద్దలకు కేసీఆర్ కి మధ్య భేటీ జరగడం తెలిసిందే. ఈ చర్చల కారణంగా సినీ పరిశ్రమ పట్ల కేసీఆర్ సానుకూలత వ్యక్తం చేయడం కూడా తెలిసిందే. కెసిఆర్ తో చర్చల అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమకు సింగిల్ విండో అనుమతులు ఇవ్వడానికి అంగీకరించడం దానికి బదులుగా చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలపడం తెలిసిందే. అయితే ఈ రోజు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఈ చర్చ గురించి తనకేమీ తెలియదని, తననెవరూ పిలవలేదని, పత్రికలలో మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే తాను తెలుసుకున్నానని ఈ వ్యాఖ్యలు చేశారు. కొంతమంది సినీ పరిశ్రమ పెద్దలు తనను సైడ్ చేశారేమో అన్న అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు.
అయితే దీనిపై స్పందించారు నిర్మాత సి.కళ్యాణ్. సినీ పరిశ్రమ తరపున చొరవ తీసుకుని ప్రభుత్వంతో మాట్లాడమని తామే చిరంజీవిని అభ్యర్థించామని, బాలకృష్ణ ని ఎవరూ అవమానించ లేదని, ఆయన కూడా తమతో కలిసి వస్తానంటే ఎవరూ కాదనరని, అక్కడ భేటీలో పాల్గొన్న మిగతా వాళ్లు సైతం తమంతట తాము చొరవ తీసుకుని సినీ పరిశ్రమ సమస్యలపై మాట్లాడడానికి ముందుకు వచ్చారని, ఎవరిని తాము ప్రత్యేకించి వ్యక్తిగతంగా ఆహ్వానించలేదని ఆయన వివరణ ఇచ్చారు.
అటు నందమూరి బాలకృష్ణ అలిగినట్లుగా వ్యాఖ్యలు చేయడం, వాటికి వెంటనే బాలకృష్ణతో కూడా సినిమాలు నిర్మించిన నిర్మాత సి.కళ్యాణ్ వివరణ ఇవ్వడం ఈరోజు ఆసక్తికరంగా మారింది. అయితే 2018 తెలంగాణ ఎన్నికల సందర్భంగా కెసిఆర్ ప్రభుత్వం పై బాలకృష్ణ అసందర్భ వ్యాఖ్యలు చేసిన కారణంగా బహుశా ప్రభుత్వ పెద్దలకు ఇబ్బంది కలిగించవద్దు అనే ఉద్దేశంతో బాలకృష్ణ ని ఈ భేటీ సమయంలో పక్కన పెట్టి ఉండవచ్చని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగు సినీ పరిశ్రమ పై సానుకూల స్పందన వ్యక్తం చేసి, పరిశ్రమకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్న దరిమిలా నటుడు బాలకృష్ణ కూడా తన వ్యక్తిగత భావోద్వేగాలను సినీ పరిశ్రమపై రుద్దక పోవడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.