తెలంగాణ రాష్ట్ర సమితి మీద తనకు చాలా కాలంనుంచి ప్రేమాభిమానాలు ఉండిఉండవచ్చు గానీ.. ఇన్నాళ్ల తర్వాత.. ఇప్పుడు హఠాత్తుగా నిర్ణయం తీసుకుని తెదేపాను వీడి వలసవెళ్లడం వెనుక ప్రధానమైన మతలబు ఏమిటి? ఆయన బయటకు చెబుతున్నట్లుగా కేవలం గ్రేటర్లో పార్టీ ఓటమి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తెరాస వెంటే ఉన్నారని తేలిపోతుండడంతో.. వారి అభిప్రాయాల్ని గౌరవిస్తూ పార్టీ మారారా? లేదా, తెరాస సర్కారు నుంచి కొత్త ఆఫర్లను మాట్లాడుకున్నారా? తాను వెళ్లిపోవడం మాత్రమే కాకుండా.. ”తెలుగుదేశం లోని కార్యకర్తలు, నాయకులు అందరూ ఆలోచించుకోండి… ఆ పార్టీ చచ్చిపోయినట్లే.. వచ్చి తెరాసలో చేరండి” అంటూ పిలుపు ఇచ్చేంతగా పార్టీలో అంకితం అయిపోతున్నారంటే ఆఫర్లే కారణమా? అనే చర్చలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి.
తెలంగాణలో సీనియర్ నాయకుల్లో ఒకడైన ఎర్రబెల్లికి మంత్రిపదవి ఇస్తాం అనే ఆఫర్‌తోనే తెరాసలో చేర్చుకున్నట్లుగా తెలుస్తున్నది. నిజానికి వరంగల్ జిల్లానుంచి మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో కొండాసురేఖ, వినయభాస్కర్ వంటి తెరాస సీనియర్లున్నారు. వీరిని పక్కన పెట్టి అయినా సరే.. వారిలో అసంతృప్తి వచ్చినా సరే.. ఎర్రబెల్లికి పదవి ఇస్తాం అనే కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
తెలంగాణ సర్కారులో పూర్తిస్థాయిలో ఇప్పటికే 18మంది మంత్రులు ఉన్నారు. ఇక విస్తరణకు ఇక్కడేమీ అవకాశం లేదు. కేవలం పునర్వ్యవస్థీకరణ మాత్రమే జరగాల్సి ఉంది. పైగా ఇప్పుడున్న కేబినెట్లోనే కులాల సమతూకం సరిగ్గా లేదనే విమర్శలు, మహిళలకు చోటు లేదనే విమర్శలు పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణ ఎటూ చేయాల్సి ఉంది. ఆ సమయంలోనే ఎర్రబెల్లికి మంత్రి పదవి కూడా కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో ఎర్రబెల్లికి కేబినెట్ ఆఫర్‌తో ఆయన పార్టీలోకి రాలేదని, కాకపోతే.. తన సోదరుడు రవీందర్ రావుకు వరంగల్ మేయర్ స్థానం కట్టబెట్టాలనే ఆఫర్ మాట్లాడుకుని పార్టీలోకి వచ్చారని.. కేబినెట్‌కు సంబంధించినంత వరకు ఈ మూడేళ్లు ఆయన ఖాళీగా ఉండాల్సిదేనని కూడా పుకార్లు వినవస్తున్నాయి.