శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన వాటిని అమ్మే ప్రసక్తే లేదని… తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు పాలకమండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆస్తుల అమ్మకాన్ని పూర్తిగా నిషేధిస్తూ.. విధానపరమైన తీర్మానం కూడా చేశారు. ఇప్పటి వరకూ టీటీడీ ఆస్తులు అమ్ముతున్నారంటూ జరిగినదంతా అసత్య ప్రచారం అని.. ఆ ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని.. టీటీడీ బోర్డు తీర్మానించింది. ఇలాంటి ఆరోపణలు రాకుండా ఉండాలంటే సమగ్ర విచారణ జరిపించాల్సిందేనని బోర్డు సభ్యులు చెబుతున్నారు.
తమిళనాడులో ఉన్న శ్రీవారి ఆస్తులను టీటీడీ బోర్డు అమ్మకానికి పెట్టింది నిజం. ఆ మేరకు.. కమిటీల్ని నియమించి.. ఆ ఆస్తుల్ని కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారులకు అధికారాలు కట్టబెట్టింది నిజం. వివాదాస్పదం కాకపోతే.. ఈ పాటికి వేలం కూడా పూర్తి అయి ఉండేది నిజం. అమ్మితే తప్పేమిటని.. స్వయంగా టీటీడీ బోర్డు చైర్మన్ వాదించారు కూడా. అయినప్పటికీ.. ఇప్పుడు అదంతా అసత్య ప్రచారమంటూ.. కొత్త వాదన తెరపైకి తీసుకు వచ్చారు. శ్రీవారి ఆస్తుల అమ్మకాలను నిలిపివేయడం.. భక్తులకు ఊరట కలిగించేదే కానీ.. తమ తప్పేమి లేదని.. నిండా మునిగిపోయిన తర్వాత చెప్పుకోవడానికి ఇతరులపై నిందలేయడానికి.. టీటీడీ బోర్డు చైర్మన్ ఏ మాత్రం వెనుకడుగు వేయకపోవడమే చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది.
లాక్ డౌన్ కారణంగా.. తిరుమలకు భక్తుల రాకపోకలు లేవు. దీంతో ఆదాయం బాగా పడిపోయింది. ఈ సమయంలో.. ఏం చేయాలన్నదానిపై.. టీటీడీ బోర్డు చర్చించింది. లాక్డౌన్ నిబంధనలు సడలించాకే స్వామివారి దర్శనాన్ని కల్పించేందుకు ప్రభుత్వం అనుమతి తీసుకొని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకున్నారు.