అప్పు రేపు.. తరహాలో ప్రత్యేకహోదా రేపు అంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గతంలో ఆయన “హోదా యోధ”గా స్వయం ప్రకటితంగా చేసుకున్న పోరాటం ఏమయిందని.. ప్రజలు అడిగినన్ని సీట్లు ఇచ్చి.. అధికారం కట్టబెట్టిన ఏడాది తర్వాత కూడా.. హోదా తీసుకు రాలేదమిటని వస్తున్న విమర్శలపై.. చాలా కూల్‌గా స్పందించారు సీఎం జగన్. హోదా వస్తుందని.. చెప్పుకొచ్చారు. అప్పు తీసుకున్నవాడు ఇస్తా ఇస్తా.. అని చెబుతూనే ఉంటాడు కానీ.. ఎప్పుడు ఇస్తాడో చెప్పడు.. అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యేకహోదా వస్తుంది.. వస్తుంది అంటున్నారు కానీ.. ఎప్పుడు తెస్తారో మాత్రం చెప్పడం లేదు. కేంద్రానికి మన అవసరం లేదని అందుకే ప్రత్యేకహోదా రావడం లేదని.. అంత మాత్రాన అడగకూడదని ఎక్కడా లేదని ఆయన అంటున్నారు.
ఇరవై ఐదుకి ఇరవై ఐదు సీట్లు ఇస్తే.. ఢిల్లీ మెడలు వంచుతానని గతంలో జగన్ చెప్పేవారు. ప్రజలు దాదాపుగా అన్నీసీట్లు ఇచ్చారు. తీరా.. ఇప్పుడు.. తన ప్రకటనలకు షరతులు వర్తిస్తాయన్న విధంగా కామెంట్లు చేస్తున్నారు. కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందిన ఎంపీలు అవసరమో లేదో.. కొద్ది రోజులుగా తెలుస్తూనే ఉంది. ఎన్నార్సీ, ఎన్పీఆర్ బిల్లలు సహా.. ప్రతీ బిల్లుకు కేంద్రానికి మద్దతిచ్చారు జగన్మోహన్ రెడ్డి. దానికి బదులుగా.. కేంద్రం నుంచి రాజకీయ ప్రయోజనాలు పొందే అనేక విషయాల్లో సానుకూల నిర్ణయాలు తెచ్చుకున్నారు. ఎస్ఈసీ తొలగింపు అందులో ఒకటి. రాజకీయ లాభాలు పొందేందుకు మాత్రం.. తన ఎంపీల అవసరాన్ని కేంద్రానికి కల్పిస్తున్న జగన్ హోదా విషయంలో మాత్రం.. కేవలం మాటలు చెబుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రత్యేకహోదా వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతీ జిల్లా హైదరాబాద్ అవుతుందని.. ఉద్యోగాల విప్లవం వస్తుందని.. ఇన్‌కంట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు.. అంత గొప్ప ప్రయోజనాలు ఏపీకి మిస్సవుతున్నా.. కూడా సంయమనంతో అడుగుతూనే ఉండాలని చెప్పుకొస్తున్నారు. కేంద్రం ఏపీపై ఆధారపడిన రోజున.. ప్రత్యేకహోదా తీసుకొస్తానని.. ఆయన చెప్పుకొస్తున్నారు. అలాంటిపరిస్థితి ఉంటే… జగనే కాదు.. పవన్ కల్యాణ్ అయినా హోదా తీసుకొస్తారనేది సామాన్యులు చెప్పే మాట. అది నిజమే కదా..!