మిడతలపై తెలంగాణ సర్కార్ యుద్ధం ప్రకటించింది. సరిహద్దుల్లోనే ఆయుధాలతో కాపలాకు సిద్ధమయింది. పొరుగు రాష్ట్రాల నుంచి మిడతల దండు వస్తూంటే.. అక్కడికక్కడే సంహరించడానికి రసాయనాలు కూడా సిద్ధం చేసుకుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో 15 వేల లీటర్ల మలాతియాన్, క్లోరోఫైరిపాస్, లామ్డా సైలోత్రిన్ ద్రావణాలను, 12 అగ్నిమాపక, 12 జెట్టింగ్ యంత్రాలను సిద్ధం చేసుకున్నారు. మిడతల దండు కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, నివారణ చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ టీంను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్లలో మిడతల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
మిడతల దండు దాడి చేసిన రాష్ట్రాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిడతలు.. ఇలా.. లక్షల సంఖ్యలో ఊళ్ల మీద పడుతున్నాయి. పొలాల మీద పడుతున్నాయి. రైతులకు.. సామాన్యులకు వేల కోట్లు నష్టం కలుగచేస్తున్నాయి. వాటిని ఎలా తరిమికొట్టాలో తెలియక… అందరూ నానా తంటాలు పడుతున్నారు. ఈ మిడతలు.. ఒకే సారి పదుల సంఖ్యలో సంతానోత్పత్తి చేస్తాయి. వేగంగా పెరుగుతాయి. ఒక్కో మిడత తన బరువుతో సమానంగా ఆహారం తీసుకుంటుంది. వీటి ఆహారం..రైతులు వేసిన పంటలే. మిడతల దండు ఉత్తర ఆఫ్రికా దేశాల నుంచి పాకిస్తాన్ మీదుగా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు విస్తరించింది.
వాటిని అక్కడ నిరోధించలేకపోతే.. తెలుగు రాష్ట్రాల రైతులకు చుక్కలు చూపిస్తాయి. మిడతల దండు గంటకు 12-15 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎందుకైనా మంచిదని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏం చేయాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ మిడతలు అక్కడక్కడ కనిపిస్తాయి. కానీ.. వాటి తీరు వేరు. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలపై దాడి చేస్తున్న మిడతల తీరు వేరు. ఓ రకంగా ఇవి రాకాసి మిడతలు. చెట్టు మీద వారితే.. ఆ చెట్టు మొత్తాన్ని తినేస్తాయి.