వారందరూ తెలుగుదేశం నుంచి తెరాసలోకి జంప్ చేస్తున్న ఎమ్మెల్యేలు. ఇప్పుడు కొత్తగా అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు గనుక కేసీఆర్‌ను వారు ఆకాశానికి ఎత్తేస్తూ.. బంగారు తెలంగాణ నిర్మాణం ఆయన ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అంటూ… ఆ లక్ష్యం కోసమే తామందరమూ ఆయన వెంట నడవడానికి పార్టీ మారిపోతున్నాం అంటూ ప్రకటించడంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. కానీ ఒక్కొక్కరుగా తెలుగుదేశాన్ని వీడి, తెరాసలో చేరుతున్న ఎమ్మెల్యేలు చెబుతున్న మాటలను లోతుగా గమనిస్తే గనుక.. కేసీఆర్ సర్కార్ తెదేపా ఎమ్మెల్యేలను ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నదో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అధికారికంగా ఈ ఎమ్మెల్యే స్టేట్‌మెంట్లలోనే సర్కారీ బ్లాక్‌మెయిలింగ్ ఆనవాళ్లు దొరకడం విశేషం.
గురువారం రాత్రి పార్టీ మారడానికి తన నిర్ణయం ప్రకటించిన నారాయణపేట్ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసమే తెరాసలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేగా 20 నెలల పదవీ కాలంలో తన నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయించుకోలేకపోయానంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందరోజు తెరాసలోకి వెళ్లిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా ఇంచుమించు ఇవే మాటలు చెప్పారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే వెళుతున్నట్లు ప్రనకటించారు. ఇదంతా బాగానే ఉంది.
అయితే వీరి మాటలను బట్టి కలుగుతున్న ప్రధానమైన సందేహం ఏంటంటే.. అధికార పార్టీలో ఉంటే మాత్రమే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతాయా? మరో పార్టీ ఎమ్మెల్యే ఉంటే.. ఆ నియోజకవర్గంలో ’20 నెలల్లో’ ఒక్క పని కూడా జరగకుండా అధికార పార్టీ అడ్డం పడుతూ ఉంటుందా? సదరు ఎమ్మెల్యేల్లో విరక్తి పుట్టే పరిస్థితిని అధికార పార్టీ సృష్టిస్తూ ఉంటుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు రాజేందర్‌రెడ్డి చెబుతున్న మాటలు అలాగే ఉన్నాయి. డిల్లీనుంచి కేసీఆర్ వచ్చిన తర్వాత.. తన నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడుకుని చేరుతా అని ఆయన అంటున్నారు. అంటే.. తెరాసలో చేరితే తప్ప తెదేపాకు చెందిన ఏ ఎమ్మెల్యే నియోజకవర్గంలోనూ ఒక్క పని కూడా చేయబోం అంటూ కేసీఆర్ సర్కారు బ్లాక్మెయిల్ చేస్తున్నదా? అనే సందేహాలు రేగుతున్నాయి. తెలిసో తెలియకో తెదేపానుంచి తెరాసలోకి వెళ్తున్న నాయకులే.. కేసీఆర్ మీద ఇలాంటి అనుమానాల్ని జనంలో నాటుతూ ఉండడం విశేషం.