తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని ప్రకటిస్తారని.. కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇలా ప్రచారం జరిగినప్పుడల్లా.. ఏదో ఓ వివాదం రేవంత్ రెడ్డిని చుట్టుముడుతోంది. గతంలో కొన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లను ప్రకటించినప్పుడు డ్రోన్ కేసులో రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు. దాంతో తెలంగాణ పీసీసీ చీఫ్ ప్రకటన వాయిదా పడిందని ప్రచారం జరిగింది. తాజాగా మళ్లీ ఏఐసిసి.. పీసీసీ ఛీఫ్ ప్రకటనకు రంగం సిద్ధం చేసిందని ఢిల్లీ నుంచి సంకేతాలు రాగానే… తెలంగాణలోని ఆయన వ్యతిరేక వర్గం.. పావులు కదపడం ప్రారంభించింది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెర ముందుకు వచ్చేసి.. రేవంత్ పై ఆరోపణలు ప్రారంభించారు. రేవంత్ రెడ్డి తప్ప పీసీసీ చీఫ్ పోస్టుకు ఎవరైనా ఓకే అంటూ.. ప్రకటన చేశారు. తాను హైకమాండ్‌కు కూడా అదే చెబుతానని చెప్పుకొచ్చారు.
తాను పీసీసీ చీఫ్ రేసులో ఉన్నానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు కానీ.. అటూఇటూ తిరిగి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డికే మద్దతు పలుకుతున్నారు. తన అభ్యర్థిత్వాన్ని సీరియస్‌గా చెప్పుకోకుండా.. వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోనే… వెళ్లాలంటూ.. ఓ ప్రకటన కూడా చేసేశారు. ఉత్తమ్ పై రేవంత్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పోస్టు దక్కకూడదని కాంగ్రెస్‌లోని ఓ బలమైన వర్గం.. తీవ్రంగా లాబీయింగ్ చేస్తోంది. ఆ మేరకు హైకమాండ్‌కు కూడా.. నివేదికలు పంపుతున్నారు. కానీ గతంలోలా కాంగ్రెస్ ఇప్పుడు లేదు. ఒకరిపై ఒకరు చేసుకునే ఫిర్యాదుల్ని.. కాంగ్రెస్ అధిష్టానం పరిగణనలోకి తీసుకోవడం లేదు. తాము అనుకున్నదే చేస్తోంది.
రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇవ్వడానికే.. రాహుల్ గాంధీ సుముఖంగా ఉన్నారని.. ఏఐసిసి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన దూకుడే.. కాంగ్రెస్ పార్టీకి రేసులోకి తెస్తుందని నమ్ముతున్నారని అంటున్నారు. అయితే.. నిన్నామొన్న పార్టీలోకి వచ్చిన రేవంత్ … పీసీసీ చీఫ్ అయితే.. సీనియర్లం తమ పరిస్థితి ఏమిటని చాలా మంది అడ్డుపుల్ల వేస్తున్నారు. అయితే.. ఒక్క సారి రేవంత్ కు హైకమాండ్ పదవి ప్రకటిస్తే.. ఎవరూ వ్యతిరేకించే పరిస్థితి ఉండదని అంటున్నారు.