కరోనా వల్ల కథలు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. గ్రూపు డాన్సులు లేవు. లిప్ లాక్కులు డౌటే. ఫారెన్ షెడ్యూళ్లు.. పూర్తిగా పక్కన పెట్టాల్సిందే. స్క్రిప్టులో అలాంటి అవకాశాలు లేకుండా చూసుకోవడం దర్శకుల ప్రాధమిక బాధ్యత అయిపోయింది. `సర్కారు వారి పాట` కూడా ఇందుకు మినహాయింపు కాదు.
మహేష్ బాబు – పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం `సర్కారు వారి పాట`. ఈ స్క్కిప్టుని ఇప్పటికే చాలా సార్లు మార్చాడు పరశురామ్. కరోనా వల్ల ఇప్పుడు ఇంకోసారి మారింది. కథ ప్రకారం.. కొంతభాగం అమెరికాలో షూటింగ్ జరగాలి. నిజానికి ఆ షెడ్యూలే చాలా కీలకం. ఓ బ్యాంకు దగ్గర వందల కోట్లు అప్పు చేసి విదేశాలకు పారిపోతాడు విలన్. అలాంటి విలన్ని ఇండియాకి రప్పించి, అప్పు వసూలు చేయిస్తాడు హీరో. కనీసం 40 శాతం షూటింగ్ అమెరికాలో జరగాలి. ఇప్పుడు ఆ సన్నివేశాల్ని మార్చుకుని రాసుకోవాల్సివచ్చింది. కొత్త స్క్రిప్టు ప్రకారం షూటింగ్ అంతా ఇండియాలోనే జరగబోతోంది. మహేష్ సలహాతోనే ఫారెన్ షెడ్యూల్ మొత్తం లేపేశారని, దానికి తగ్గట్టు ఇండియాలోనే ఆ భాగాన్ని తెరకెక్కిస్తారని సమాచారం. మహేష్సినిమా అనే కాదు, మిగిలిన సినిమాలూ ఇప్పుడు ఇదే బాట పడుతున్నాయి. ఇదంతా కరోనా ఎఫెక్టే.