రెండు గ్యాంగులు ఖాళీ ప్లేస్ చూసుకుని ..ముహుర్తం పెట్టుకుని మరీ కత్తులు, కటార్లతో దాడులకు దిగాయి. ఆ దాడుల్లో ఓ గ్యాంగ్ నాయకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంకో నాయకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కత్తులతో ఎవరో ఒకరే ఉండాలనేలా… వారు నరుక్కునే సీన్లు సినిమాల్లోనే చూసిన చాలా మంది జనం.. అక్కడ జరుగుతున్న దాడులు చూసి.. భయంతో వణికిపోయారు. ప్రాణాలంటే లెక్కలేనంత ఈజీగా.. అంత జరుగుతున్నా.. పట్టించుకోవడానికి బెజవాడలో పోలీసులే లేనట్లుగా.. అరగంటకు పైగా సాగిన పోరాటం.. మరోసారి పాత కథల్ని గుర్తుకు వచ్చేలా చేశాయి.
ఓ అపార్ట్మెంట్ సెటిల్మెంట్ విషయంలో సందీప్, మణికంఠ అనే ఇద్దరు జోక్యం చేసుకోవడంతోనే గొడవ పెరిగింది. వీరిద్దరూ.. చిన్న సైజ్ గ్యాంగుల్ని చేరవేసి.. సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారు. అయితే.. ఇద్దరూ ఒకే ఆస్తికి సంబంధించి.. ఇతరులతో సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నించడం.. మేము చేస్తామంటే..మేము చేస్తామని బెదిరింపులకు దిగడంతో వారిలో వారే సెటిల్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి ఆ సెటిల్మెంట్ ఎలా చేసుకోవాలంటే.. ఇలా ఖాళీ ప్లేస్ చూసుకుని కత్తులు, కర్రలు, బ్లేడ్లు, కారంతో.. దాడులు చేసుకుని చంపుకునేలా సెటిల్మెంట్ ప్లాన్ చేసుకున్నారు. చివరికి అనుకున్నంత పని చేశారు.
సందీప్, మణికంట అనే ఇద్దరిపైనా.. పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. వారు ఇలాంటి దాడులు దందాలు చేస్తారని పోలీసులకు తెలుసు. అయినప్పటికీ వారిపై ఎలాంటి నిఘా పెట్టలేదు. పైగా.. మరణించిన సందీప్‌పై గతంలో రౌడీషీట్ ఉండేది. ఈ మధ్యనే తొలగించినట్లుగా తెలుస్తోంది. దీంతో పోలీసుల నిఘా జాబితా నుంచి సందీప్ ను తొలగించారు. పరిస్థితి ఇప్పుడు విషమంగా మారిపోయింది. గతంలో విజయవాడలో గ్యాంగ్ వార్ ఉండేది కానీ… ఇలా ప్లేస్ చూసుకుని చంపుకుందాం..రండి అన్నట్లుగా ఉండేది కాదు. పోలీసులు కఠినంగా ఉండే ఇలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశంమే లేదు. కానీ ఇప్పుడు.. పరిస్థితి మారిపోయింది.