వెండి తెర – ఓటీటీ …. వీటి మధ్య గట్టి పోటీ ఎదురైంది. థియేటర్లు మూసిన వేళలో, సినిమాల్ని లాక్కోవాలని ఓటీటీ ఆరాటపడుతోంది. ఎలాగైనా సరే, థియేటర్ వ్యవస్థని కాపాడుకోవాలని సినిమాల్ని వెండి తెరపైనే చూడాలన్న పోరాటం మరోవైపు. మరి.. భవిష్యత్తులో సినిమా పరిశ్రమ ఏ దారిన వెళ్తుంది? హీరోల మాటేంటి? దీనిపై స్పందించారు ప్రముఖ పంపిణీదారుడు అభిషేక్ నామా. ఆయన తెలుగు 360తో మాట్లాడుతూ “ఓటీటీ నుంచి గట్టిపోటీ ఉంది. అయితే.. పెద్ద హీరోలు తమ సినిమాల్నిఓటీటీకి అమ్మడానికి ఒప్పుకోరు. వాళ్ల అభిమానులకూ ఓటీటీ వేదికలు అంత తృప్తినివ్వవు. పవన్‌కల్యాణ్ లాంటి హీరో సినిమాని బుల్లి తెరపై చూడలేం. థియేటర్లో చూస్తే వచ్చే ఆ కిక్ వేరు. చిన్న సినిమాల బడ్జెట్ తక్కువ. వాటిని ఓటీటీ ద్వారా తిరిగి సాధించుకోవొచ్చు. కానీ పెద్ద సినిమా అంటే ఈరోజుల్లో వంద కోట్ల మాట. అంత ఖర్చు పెట్టి ఓటీటీ సంస్థలు పెద్ద సినిమాల్ని కొనలేవు. ఓ తెలుగు సినిమా వచ్చిందంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్లలో కూడా అమ్ముకుంటారు. ఇప్పుడు నార్త్ ఇండియా మార్కెట్ బాగా పెరిగింది. అవన్నీ కోల్పోడానికి ఏ నిర్మాతా ఒప్పుకోడు. తమిళనాడులో ఓటీటీ ద్వారా కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. వాటి ఫలితం అంతంత మాత్రమే. అవేమీ నిర్మాతలకు గానీ, ఓటీటీ సంస్థలకు గానీ డబ్బులు ఇవ్వలేకపోయాయి. దీన్ని బట్టి… ఓటీటీ ప్రభావం ఎంతో అర్థం చేసుకోవొచ్చు” అని తేల్చేశారు.
పంపిణీదారుడిగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో వంద సినిమాల మైలు రాయిని అందుకున్నారు అభిషేక్. ఇప్పుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తీస్తున్నారు. షూటింగులకు అనుమతి రాగానే ఈ సినిమా పట్టాలెక్కుతుంది. త్వరలోనే మూడు కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేస్తున్నట్టు అభిషేక్ నామా తెలిపారు.