తాను చనిపోయేవరకు జగన్‌కు, ఆయన కుటుంబానికి విధేయుడిగానే ఉంటానని.. నన్ను శంకించాల్సిన అవసరం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా ముఖంగా వెల్లడించారు. వైఎస్ జగన్ కు… అత్యంత ఆప్తునిగా పేరు తెచ్చుకున్న ఆయన ఇలా.. విధేయత గురించి.. శంకించడం గురించి మాట్లాడాల్సి రావడంతో.. వైసీపీలో పరిస్థితులు.. బయట ప్రచారం జరుగుతున్నట్లుగానే అంత సానుకూలంగా లేవన్న చర్చ వైసీపీ వర్గాల్లోనే ప్రారంభమయింది. తనకు, జగన్‌కి ఎలాంటి విభేదాలు లేవు..రావు అని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. ఎప్పుడూ మాట్లాడే మాటలకు… తాజాగా విశాఖలో ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడిన మాటలకు తేడా ఉండటంతో.. వైసీపీ నేతలు కూడా.. కాస్త ఆశ్చర్యపోవాల్సివచ్చింది.
ఇకపై వైసీపీ సోషల్ మీడియా వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటానని .. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వీరసైనికులని కితాబిచ్చారు. 90 మందికి హైకోర్టు నోటీసులు ఇచ్చిందని… వారు పెట్టిన పోస్టులు తప్పనిగానీ, ఒప్పనిగానీ చెప్పడం లేదన్నారు. నోటీసులు అందుకున్న వారిలో నిజమైన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైసీపీ కార్యకర్తల పేరుతో టీడీపీ ఫేక్ ప్రచారం చేస్తోందని.. నిజమైన వైసీపీ కార్యకర్తలు.. జగన్ నాయకత్వాన్ని సమర్థించేవాళ్లకు అండగా ఉండి తీరుతామని చెప్పుకొచ్చారు. అదే సమయంలో.. న్యాయవ్యవస్థని కించపరిచే ఉద్దేశంగానీ.. అగౌరవపరిచే ఉద్దేశం ఏ ఒక్క వైసీపీ కార్యకర్తకు లేదని సర్టిఫికెట్ ఇచ్చేశారు.
నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ను ఎస్ఈసీగా తొలగిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై… టీడీపీ కోర్టుకెళ్లడాన్ని విజయసాయిరెడ్డి తప్పు పట్టారు. టీడీపీ ప్రభుత్వం లేకున్నా..వాళ్ల మనుషులే ఉండాలనుకుంటున్నారని .. విమర్శించారు. రమేష్ కుమార్ రాసిన లేఖ టీడీపీ కార్యాలయంలోనే తయారయిందని ఆరోపించారు. నిజానికి రమేష్ కుమార్ తొలగింపు ఆర్డినెన్స్‌పై.. బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలు కోర్టులో పిటిషన్లు వేశాయి. కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ సుప్రీంకోర్టులో కేవియట్ కూడా వేశారు. అయితే.. ఒక్క టీడీపీనే వెళ్లిందన్నట్లుగా వైసీపీ నేతలు కొత్తగా ప్రచారం చేయడం ప్రారంభించారు. నిన్న బొత్స.. ఇవాళ విజయసాయిరెడ్డి అదే తరహా ప్రకటనలు చేశారు.