ఎస్ఈసీ అర్హతలు మార్చుతూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ.. ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు కొనసాగుతున్నప్పటికీ…ఎస్ఎల్పీ దాఖలు చేయడంతో.. ఈ పిటిషన్ రేపో, ఎల్లుండో విచారణకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. సుప్రీంకోర్టులో స్టే వస్తుందన్న నమ్మకంతో.. ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టకుండా.. రమేష్‌కుమార్‌ను ప్రభుత్వం నిలువరించింది. విచారణకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కూడా..స్టే ఇవ్వకపోతే… నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వం మరిన్ని ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది.
అయితే.. ఇక్కడా ప్రభుత్వం న్యాయపరంగా వ్యూహాత్మక తప్పిదం చేసిందని న్యాయవాద నిపుణులు చెబుతున్నారు. తీర్పు అమలు నిలుపుదల చేయాలని.. హైకోర్టుకు ఇప్పటికే ప్రభఉత్వం తరపున లేఖ రాశారు. అంటే విషయం హైకోర్టులో ఉన్నట్లు అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో సహజంగా కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన దగ్గర తేల్చుకోమని చెప్పే అవకాశం ఉంటుంది. అయితే.. ఆ పిటిషన్ హైకోర్టుకు సెలవులు అయిపోయిన తర్వాతే విచారణకు వచ్చే అవకాశం ఉంది. అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమాకమే చెల్లదని.. ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది.
ఈ వాదన ఎంత వరకు నిలబడుతుందనేదానిపై న్యాయవర్గాల్లోనే సందేహాలున్నాయి. ఎస్ఈసీ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లకపోతేనే.. మంచిదని అనేక మంది ప్రభుత్వానికి సూచించినప్పటికీ…రమష్కుమార్ బాధ్యతలు చేపట్టకుండా… నిలుపుదల చేసి మరీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ప్రభుత్వం. సుప్రీంకోర్టు విచారణ తర్వాత ఈ వ్యవహారం కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది.