తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించి ఆరేళ్లు. రాష్ట్రం ఏర్పడిన రోజే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బంగారు తెలంగాణ దిశగా కేసీఆర్… శ్రమించారు. రైతుల్ని బాగు చేస్తేనే అది సాధ్యమని నమ్మి సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. పొరుగు రాష్ట్రాల తో నీటి వివాదాలకు స్వస్తి పలికి ఒప్పందాలు చేసుకుని ప్రాజెక్టులను రీ డిజైన్ చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్ చేసి కాళేశ్వరం గా మార్చారు. అనుమతులు సాధించి శరవేగంగా మూడేళ్ళ ల్లోనే పూర్తి చేశారు. గోదావరి పై తల పెట్టిన సీతారామ, దేవాదుల ఫేస్ 3,ప్రాజెక్టుల పనులు పరుగులు పెట్టిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పెండింగులో ఉన్న కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు,కోయిల్ సాగర్ పనులు పూర్తి చేశారు. పాలమూరు,డిండి ప్రాజెక్టుల పనులు వేగంగా కొనసాగిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యం చేరుకునే అవకాశాలు ఉన్నాయి.
మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ వంటి భారీ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.మిషన్ కాకతీయలో భాగంగా రాష్ట్రంలో ని చెరువుల పూడిక తీత,సుందరీకరణ పనులు చేపట్టారు. రూ. 35 వేల కోట్లతో ఇంటింటికి నీరందించే మిషన్ భగీరథ పథకం దాదాపు పూర్తయింది.కంటి వెలుగు కార్యక్రమంతో కోటిన్నర మందికి ఉచిత పరీక్షలు నిర్వహించి,35 లక్షల మందికి కళ్ళద్దాలు పంపిణీ చేశారు. కొత్త రాష్ట్రంలో పాలనను ప్రజలకు చేరువగా తీసుకెళ్లేలా సంస్కరణలు చేపట్టారు. అందులో భాగంగా కొత్త జిల్లాలు,మండలాలు,గ్రామపంచాయతీ లు ఏర్పాటు చేశారు.రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విభజించడమే కాకుండా,జోనల్ వ్యవస్థను సవరించి 6 జోన్లు ఏర్పాటు చేశారు.కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానంలో భాగంగా కొత్తగా 750కి పైగా ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించారు.రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో సంస్కరణలకు ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణా రాష్ట్రంలో రైతులకు వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా రైతు బంధు పథకం అమలు చేస్తున్నారు. రైతులకు 5లక్షల భీమా,రైతు బంధు సమితుల వంటి వినూత్న కార్యక్రమాలతో రైతులకు అండగా నిలుస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలోనూ యాసంగిలో 52 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది తెలంగాణా రాష్ట్రం.మొత్తంగా ఈ ఏడాదిలో కోటి మెట్రిక్ టన్నులకు పైగా వరి పండించే స్థాయికి ఎదిగింది. పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి,హరితహారం వంటి కార్యక్రమాలతో పల్లెలు,పట్టణాల స్వరూపం మార్చే ప్రణాళికలు రూపొందించారు.కొత్త పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలతో పంచాయతీ లు,మున్సిపాలిటీ ల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. యాదాద్రి దేవాలయంను కనీవినీ ఎరుగని రీతిలో పునర్నిర్మిస్తున్నారు.
ఆరేళ్లలో కేసీఆర్ తెలంగాణ వనరులను పకడ్బందీగా వాడుకుంటూ.. ప్రజలందరి సమగ్ర అభివృద్దికి ప్రయత్నిస్తున్నారని నిస్సందేహంగా చెప్పుకవచ్చు.