ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయి రెడ్డి. ఆ పదవి రాక ముందు నుంచి.. వైసీపీ తరపున ఆయనే పనులు చక్కబెట్టేవారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతక రెండు జీవోలు మార్చి.. లాభదాయక పదవుల నుంచి .. ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి పదవిని తప్పించి మరీ జగన్ విజయసాయిరెడ్డికి ఆ పదవి కట్టబెట్టారు. ఇప్పటి వరకూ.. ఢిల్లీలో అన్ని వ్యవహారాలు ఆయనే చక్కబెట్టారు. అయితే మొదటి సారి.. విజయసాయిరెడ్డితో సంబంధం లేకుండా.. జగన్ ఢిల్లీ పర్యటనను చక్కబెట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అమిత్ షాతో అపాయింట్మెంట్.. ఇతర మంత్రుల అపాయింట్మెంట్లు ఖరారు చేయించే బాధ్యతను ఈ సారి విజయసాయిరెడ్డికి చెప్పలేదంటున్నారు.
మామూలుగా.. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే షెడ్యూల్ ఉంటే.. రెండు, మూడు రోజుల ముందుగానే విజయసాయిరెడ్డి ఢిల్లీ వెళ్లి ఏర్పాట్లు చూస్తారు. అందుబాటులో ఉండే కేంద్రమంత్రుల అపాయింట్మెంట్లు.. ఇతర అంశాలను చూస్తారు. అయితే.. ఈ సారి విజయసాయిరెడ్డి విశాఖకే పరిమితం అయ్యారు. విజయసాయిరెడ్డి కూడా ప్రత్యేక విమానాల్లోనే ఎక్కువగా తిరుగుతూంటారు. వాటికి అనుమతి లేదనుకుంటే.. దేశీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. విజయసాయిరెడ్డి ఢిల్లీ వెళ్లడానికి పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు ఏమీ లేవు. ఆయన హైదరాబాద్ – విజయవాడ – విశాఖకు చక్కర్లు కొడుతూనే ఉన్నారు. కానీ జగన్ ఢిల్లీ టూర్ ఏర్పాట్లు మాత్రం ఆయన చేతుల్లోకి రాలేదు.
అసలు విజయసాయిరెడ్డిని జగన్ తనతో పాటు తీసుకెళ్లే బృందంలో చేర్చుకోలేదన్న ప్రచారం జరుగుతోంది. సోమవారం విజయసాయిరెడ్డి విశాఖలో ఉన్నారు. ఆయన సీఎం ఢిల్లీకి వెళ్తున్నారు అని అక్కడ ప్రెస్మీట్లో చెప్పారు కానీ వెళ్తున్నామని చెప్పలేదు. అంటే.. ఢిల్లీ టూర్ ప్రోగ్రాంలో విజయసాయిరెడ్డికి చోటు లేదని తేలిపోయిందంటున్నారు. తనకు జగన్‌కు.. విబేధాలు లేవు .. రావు అని చెబుతున్నారు కానీ… మొన్న విశాఖ వ్యవహారాలు చూసే తనను.. విశాఖ తీసుకెళ్లకపోవడం.. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నప్పటికీ.. తన ప్రమేయం లేకుండా.. ఢిల్లీ టూర్‌ను ఏర్పాటు చేసుకోవడం.. చూస్తే.. నిజంగానే.. గ్యాప్ వచ్చినట్లుగా అర్థం చేసుకోవచ్చంటున్నారు ఇతర పార్టీల నేతలు.