స్టేట్ ఎలక్షన్ కమిషనర్ విషయంలో.. ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేయాలంటూ… హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ సర్కార్ ఉపసంహరించుకుంది. సుప్రీంకోర్టులో తీర్పుపై సవాల్ చేసినందున.. అడ్డంకి కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. హైకోర్టులో తీర్పు అమలుపై స్టే కోరుతూ పిటిషన్ విచారణలో ఉంటే.. సుప్రీంకోర్టు కూడా.. అక్కడే తేల్చుకోమని చెప్పే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన ఏపీ ప్రభుత్వ న్యాయనిపుణులు హడావుడిగా.. ఏపీ హైకోర్టులో తాము దాఖలు చేసిన స్టే పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. నిజానికి ఆ పిటిషన్ ఈ రోజే విచారణకు రావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో ఆగిపోయింది.
ప్రస్తుతం హైకోర్టులో దాఖలు చేసిన స్టే పిటిషన్‌పై విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు వీలైనంత త్వరగా విచారణ జరిపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కానీ.. ఈ విషయంలో ఏపీ సర్కార్ కు మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు తీర్పు విషయంలో తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వవొద్దంటూ… సుప్రీంకోర్టులో కాంగ్రెస్ నేత మస్తాన్ వలితో పాటు.. బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ కూడా కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో ఉన్న పళంగా.. హైకోర్టు తీర్పుపై స్టే వచ్చే దాఖలాలు లేవని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. విచారణ తర్వాతే సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
హైకోర్టు తీర్పు అమలుపై స్టే రాకుండానే… ఆ తీర్పును అమలు చేయకుండా.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టకుండా.. ప్రభుత్వం మోకాలడ్డటం కూడా సుప్రీంకోర్టు పరిశీలనకు తీసుకెళ్లే అవకాశాన్ని కేవియట్ పిటిషన్లు దాఖలు చేసిన వాళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వం న్యాయపరంగా ఓ వ్యూహం లేకుండా.. ముందుకెళ్తోందని.. ఇలా వెళ్తే ఎదురుదెబ్బలు తప్పవని.. హెచ్చరికలు వస్తున్నా.. ప్రభుత్వం తాను అనుకున్నదే చేస్తోంది. ఫలితంగా.. న్యాయపరీక్షల్లో విఫలమవుతోంది.